దక్షిణ గాజాపై బాంబుల వర్షం.. ఒక్కరోజే 250 ఎయిర్ స్ట్రైక్స్

దక్షిణ గాజాపై బాంబుల వర్షం.. ఒక్కరోజే 250 ఎయిర్ స్ట్రైక్స్

నార్త్ నుంచి సౌత్​కు రూట్ మార్చిన ఇజ్రాయెల్

గాజా/జెరూసలెం: రెండు నెలలుగా నార్త్ గాజా పైనే ప్రధానంగా దాడులు చేస్తూ వచ్చిన ఇజ్రాయెల్ తాజాగా దక్షిణ గాజాపై దాడులు పెంచింది. మంగళవారం ఒక్కరోజే 250 ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రకటించింది. 150 వరకూ యుద్ధట్యాంకులను, పెద్ద ఎత్తున బలగాలను ఖాన్ యూనిస్ వైపు తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలు సైతం వైరల్ అయ్యాయి. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు పాల్పడిన నరమేధానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేస్తున్న బాంబు దాడులతో నార్త్ గాజా దాదాపుగా శిథిలాల కుప్పగా మారింది.

తాజాగా సోమవారం నుంచి దక్షిణ గాజాపై దాడులు మొదలుపెట్టింది. ఖాన్ యూనిస్​లోని టార్గెట్లపై దాడులు చేస్తోంది. ఇన్నాళ్లూ ఉత్తర గాజా ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించడంతో లక్షలాది మంది సౌత్​కు వచ్చారు. ఇప్పుడు దక్షిణ గాజాలోనూ బాంబు దాడులు కొనసాగుతుండటంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గాజా స్ట్రిప్ లో మొత్తం 23 లక్షల మంది ప్రజలు ఉండగా, 18 లక్షలకుపైగా మంది ఇండ్లను విడిచి రెఫ్యూజీ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. అయితే, గాజా స్ట్రిప్​లో హమాస్​ను అంతం చేసేదాకా వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు.