
నింగ్బో (చైనా): ఇండియా షూటర్ మేఘన సజ్జనార్ వరల్డ్ కప్‌లో తన తొలి మెడల్‌తో మెరిసింది. విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె కాంస్య పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో మేఘన 230 పాయింట్లతో మూడో స్థానంతో ఈ పతకం అందుకుంది. చైనా షూటర్ పెంగ్ జిన్లు 255.3 పాయింట్లతో వరల్డ్ రికార్డు సృష్టించి స్వర్ణం కైవసం చేసుకోగా.. నార్వేకి జీనెట్ హెగ్ డ్యుయెస్టాడ్ రజతం గెలిచింది.
శనివారం ఇషా సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో చాంపియన్‌గా నిలిచి ఈ టోర్నీలో ఇండియాకు ఏకైక స్వర్ణ పతకాన్ని అందించింది. దాంతో , ఈ సీజన్ చివరి వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను ఇండియా ఐదో ప్లేస్‌తో ముగించింది. మూడు స్వర్ణాలు సహా మొత్తం 10 పతకాలతో చైనా అగ్రస్థానంలో నిలవగా, నార్వే రెండు గోల్డ్ మెడల్స్‌తో రెండో స్థానం సాధించింది.