మరోసారి ఐటీ దాడులు.. 20 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు

మరోసారి ఐటీ దాడులు.. 20 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి. నగరవ్యాప్తంగా దాదాపు 20 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్ గ్రూప్‌తో పాటు రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో తనిఖీలు చేస్తున్నారు. కోహినూర్ గ్రూప్ అఫ్ కంపెనీ ఎండీ మజీద్‌తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లల్లో ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మాదన్నపేట్, కొండాపూర్, మైదిపట్నం, శాస్త్రిపురం తో పాటు పలు ప్రాంతాల్లో లో సోదాలు నిర్వహిస్తున్నారు. మాదన్నపేట రామచంద్ర నగర్ లోని కోహినూర్ డెవలపర్స్ కంపెనీ డైరెక్టర్ ఇంట్లో ఐటి సోదాలు చేసిన అధికారులు.. పలు డాక్యుమెంట్లను పరిశీలించడంతో పాటు ఆదాయానికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు.  

హైదరాబాద్‌తో పాటు పరిసర  ప్రాంతాల్లో కోహినూర్ కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ భూముల్లో కోహినూర్ గ్రూపు వెంచర్లు కూడా వేసింది. అయితే  ఈ కంపెనీ వెనుక ఒక రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఒక రాజకీయ నాయకుడికి  కోహినూర్ కంపెనీ రియల్ ఎస్టేట్ సంస్థ బినామిగా ఉన్నట్లుగా ఐటీ అధికారులు భావిస్తున్నారు. రాజకీయ నాయకుడికి బినామీగా ఉండటంతో ఈ ఐటీ దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆ రాజకీయ నాయకుడు ఎవరనే చర్చ ప్రస్తుతం  జోరుగా జరుగుతోంది.