2 వేల నోట్లు బ్యాన్ చేస్తున్నారంటూ మోసం

2 వేల నోట్లు బ్యాన్ చేస్తున్నారంటూ మోసం
  • ఫేక్ కరెన్సీ గ్యాంగ్ అరెస్ట్

నేరెడ్​మెట్, వెలుగు: రెండు వేల నోట్లు బంద్​అవుతున్నాయని, బ్లాక్​మనీ ఉన్నవారు రూ. లక్ష చిల్లర నోట్లు ఇస్తే 5 లక్షల విలువైన రెండు వేల నోట్లు ఇస్తున్నారంటూ మోసానికి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ కమిషనరేట్​లో సీపీ మహేశ్​భగవత్​శనివారం కేసు వివరాలు వెల్లడించారు. కరీంనగర్​కు చెందిన రాజిరెడ్డికి ఆరు నెలల క్రితం భాగ్యలక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇటీవల భాగ్యలక్ష్మి రూ. 2 వేల నోట్లు త్వరలో బంద్​అవుతాయంటూ రాజిరెడ్డికి చెప్పింది. బ్లాక్​మనీ ఉన్నవారు రూ. 500, రూ. 200 నోట్లు లక్ష విలువైనవి ఇస్తే రూ. 5 లక్షల విలువైన రూ. 2 వేల నోట్లు ఇస్తున్నారని నమ్మించింది. చిల్లర నోట్లు ఇచ్చి రూ. 2 వేల నోట్లు తీసుకునేందుకు శామీర్​పేటకు రావాలని చెప్పింది. ఈ నెల 2న రాజిరెడ్డి శామీర్​పేట ఫామ్​హౌజ్​కు వచ్చాడు. అక్కడ పోలీస్​డ్రెస్​లో ఉన్న వ్యక్తి బ్లాక్​మనీ దందా చేస్తున్నావా అంటూ బెదిరించి రాజిరెడ్డి దగ్గర ఉన్న రూ. 5 లక్షలు తీసుకుని పరారయ్యాడు. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన రాజిరెడ్డి 9న కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీపీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు కరీంనగర్​కి చెందిన రియల్​ఎస్టేట్​వ్యాపారి, మాజీ నేరస్తుడు మహ్మద్​అజీజ్​అలియాస్​అజామ్(35), పెద్దపల్లికి చెందిన డ్రైవర్​ మహ్మద్​అన్వర్​ పాషా(38), సనత్​నగర్​లో ఉంటూ ఫిలిం ఇండస్ట్రీలో ప్రొడక్షన్​ మేనేజర్​గా​చేస్తున్న తడుక సుభాష్​ చంద్రబోస్(41), అబ్దుల్లాపూర్​మెట్​లో ఉంటూ డ్రైవర్​గా పనిచేసే మర్రి నాగరాజు (28), కరీంనగర్​లో ఉంటూ ప్రైవేట్​ నర్స్​గా పనిచేసే జంగం భాగ్యలక్ష్మి(40), అదే జిల్లాకు చెందిన రవీందర్​ సింగ్, రాజేష్​మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. వీరి నుంచి రూ. 1.3 లక్షల నగదు, రూ. కోటి విలువైన నకిలీ నోట్లు, కారు, 8 సెల్​ఫోన్లు, పోలీస్​యూనిఫాం స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను రిమాండ్​ కు తరలించామని, పరారీలో ఉన్న ఇద్దరిని త్వరలో పట్టుకుంటామని సీపీ చెప్పారు.