- సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, పండ్ల ఉత్పత్తి
- కోకోపీట్, వర్మీ కంపోస్ట్‌తో హార్టికల్చర్ శాఖ ప్రోత్సాహం
- కాలుష్యానికి చెక్.. చల్లబడుతున్న మైక్రో క్లైమేట్
- ఇంటి అవసరాలకు ఇంట్లోనే పండ్లు, కూరగాయల పంటలు
- 320 మందితో ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్’ గ్రూప్ ఏర్పాటు
పట్టణీకరణతో పచ్చదనం కనుమరుగవుతూ, కాలుష్యం పెరుగుతున్న వేళ గ్రేటర్ వరంగల్ నగరవాసులు మిద్దె తోటల వైపు అడుగులు వేస్తున్నారు. ఇంటి మేడలపైనే కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు సాగు చేస్తూ స్వచ్ఛమైన ఆహారంతో పాటు పచ్చని వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ)’ పేరిట కొందరు ఔత్సాహికులు గ్రూపు ఏర్పాటు చేసి వందలాది మందిని సేంద్రియ సాగు వైపు ప్రోత్సహిస్తూ పట్టణాల్లో ప్రకృతి పరిరక్షణకు కొత్త దారిని చూపిస్తున్నారు.
హనుమకొండ, వెలుగు: నగరాలు కాంక్రీట్ వనాలుగా మారడంతో ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకునే అవకాశం తగ్గిపోతోంది. పట్టణీకరణ కారణంగా కాలుష్యం పెరగడంతో పాటు స్థానిక వాతావరణం కూడా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ నగరవాసులు టెర్రస్ గార్డెనింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు.
ఇంటి మిద్దెలపైనే కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు పెంచుతూ పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు కుటుంబ అవసరాలకు సరిపడా సేంద్రియ ఉత్పత్తులను పండించుకుంటున్నారు. ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్’ (సీటీజీ) పేరుతో గ్రూపుగా ఏర్పడి మిద్దె తోటలను విస్తరిస్తున్నారు.
టెర్రస్ గార్డెనింగ్ వల్ల కాలుష్యం తగ్గడం, మైక్రో క్లైమేట్ చల్లబడడం, సేంద్రియ ఆహారం అందుబాటులోకి రావడం వంటి ప్రయోజనాలు ఉండటంతో హార్టికల్చర్ అధికారులు కూడా దీనిని ప్రోత్సహిస్తున్నారు.
320 మందితో సీటీజీ గ్రూప్..
వరంగల్ నగరంలో ఇటీవల టెర్రస్ గార్డెనింగ్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. గతంలో కొద్దిమంది మాత్రమే ఇంటి మేడలపై పూలు, కూరగాయల మొక్కలు పెంచేవారు. ప్రస్తుతం చాలామంది ఖాళీ స్థలాన్ని వినియోగించుకుని పూలు, పండ్లు, కూరగాయలతో పాటు ఔషధ గుణాలున్న మొక్కలను కూడా పెంచుతున్నారు.
హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర నగరాల తరహాలో వరంగల్ ట్రైసిటీలో కూడా ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్’ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. మిద్దె తోటలు సాగు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఇందులో సభ్యత్వం కల్పిస్తున్నారు. ప్రస్తుతం 320 మంది ఈ గ్రూప్‌లో భాగస్వాములయ్యారు. గతంతో పోలిస్తే టెర్రస్ గార్డెనింగ్‌పై ప్రజల్లో అవగాహన, ఆసక్తి పెరుగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఆపిల్, డ్రాగన్ ఫ్రూట్..
మిద్దె తోటల్లో కరివేపాకు నుంచి టమాట, వంకాయ, బెండ, దొండ, కాకర, బీర, చామగడ్డ, ఆలుగడ్డ తదితర కూరగాయలు పండిస్తున్నారు. ఉసిరి, జామ, నిమ్మ, దానిమ్మ, సీతాఫలం, బొప్పాయి, ద్రాక్ష, మామిడి, బత్తాయి, రేగు వంటి పండ్ల మొక్కలతో పాటు ఆపిల్, డ్రాగన్ ఫ్రూట్, మల్బరీ వంటి ప్రత్యేక పండ్లను కూడా సాగు చేస్తున్నారు. ఇంటి పరిస్థితులకు అనుగుణంగా వివిధ ఔషధ మొక్కలను పెంచుతున్నారు. దీంతో మార్కెట్‌పై ఆధారపడకుండా ఇంట్లోనే తాజా కూరగాయలు, పండ్లు లభిస్తున్నాయి.
సేంద్రియ పద్ధతిలో సాగు..
టెర్రస్ గార్డెన్లలో కూరగాయల వ్యర్థాలు, కోకోపీట్, ఆవుపేడ, తడి చెత్తను ఎరువులుగా వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ డ్రమ్ములు, పగిలిన బకెట్లు, కుండీల్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచుతూ పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు.
హార్టికల్చర్ శాఖ ప్రోత్సాహం..
హార్టికల్చర్ అధికారులు మిద్దె తోటల సాగును ప్రోత్సహిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీటీజీ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిద్దె తోటలకు అవసరమైన కోకోపీట్, వర్మీ కంపోస్ట్ వంటి ఎరువులను తక్కువ ధరకు అందిస్తున్నారు.
వన మహోత్సవం సందర్భంగా పండ్ల మొక్కలను పంపిణీ చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన ఆహారం అందడంతో పాటు ఇంటి వాతావరణం కూడా చల్లబడుతుండటంతో మరింత మంది టెర్రస్ గార్డెనింగ్ వైపు వస్తున్నారని అధికారులు తెలిపారు.
మా కూరగాయలు మేమే పండిస్తున్నం
మా ఇంటిపై ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు సాగు చేస్తున్నాం. మల్బరీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్ల మొక్కలు కూడా నాటాం. మా ఇంటి అవసరాలకు సరిపోయే కూరగాయలు మేమే పండించుకుంటున్నాం. పెస్టిసైడ్స్ లేకుండా సొంతంగా పండించుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
- తోట కల్యాణి, హనుమకొండ-
