జలం జీవం అనేది కేవలం ఒక నినాదం కాదు. అది మానవ మనుగడకు మూలాధారం. నాగరికతలు నదుల ఒడ్డునే వికసించాయి. వ్యవసాయం, పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాలు అన్నీ నీటిపైనే ఆధారపడి అభివృద్ధి చెందాయి. అయితే నేడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, పెరుగుతున్న జనాభా, వేగవంతమైన పట్టణీకరణ, భూగర్భ జలాల క్షీణత వంటి పరిణామాలు నీటి భద్రతను ఒక ప్రధాన సవాలుగా మార్చాయి. ఈ ఏడాది కూడా దేశంలోని అనేక ప్రాంతాలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు.
వర్షాలు ఎప్పుడు పడతాయో, ఎంత కురుస్తాయో అంచనా వేయడం కష్టమవుతోంది. ఒకవైపు అతివృష్టి, మరోవైపు వర్షాభావం కనిపిస్తున్నాయి. ప్రకృతి మనకు ఒక స్పష్టమైన హెచ్చరిక చేస్తోంది. కురిసిన ప్రతి వర్షపు చుక్కను భద్రపరచుకోండి అని..
ఇటీవలి కాలంలో హైదరాబాద్‌తోపాటు ఇతర అనేక నగరాల్లో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ వాణిజ్య సముదాయాలు వేగంగా నిర్మితమవుతున్నాయి. ఇది అభివృద్ధికి సంకేతమే. పరిమిత భూమిలో ఎక్కువ మందికి నివాసం కల్పించడానికి హై-రైజ్ భవనాలు అవసరం. అయితే ప్రకృతి వనరులను సంరక్షిస్తూ జరిగే అభివృద్ధే సుస్థిర అభివృద్ధిగా నిలుస్తుంది.
ఒకప్పుడు నగరాల్లో ఖాళీ స్థలాలు, చెట్లు, మట్టి నేల విస్తారంగా ఉండేవి. వర్షం కురిసినప్పుడు ఆ నీరు సహజంగానే భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను పెంచేది. నేడు వాటి స్థానంలో కాంక్రీట్ భవనాలు, సిమెంట్ రోడ్లు, పార్కింగ్ ప్రదేశాలు పెరిగాయి. ఫలితంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా నేరుగా డ్రైనేజీల్లోకి చేరి వృథా అవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో నీటి కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
పెరుగుతున్న అపార్ట్మెంట్లు.. పెరుగుతున్న నీటి అవసరం
ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం పట్టణ ప్రాంతాలలో ప్రతి వ్యక్తికి రోజుకు సగటున 135 లీటర్ల నీరు అవసరం. అంటే నలుగురు సభ్యుల కుటుంబానికి రోజుకు సుమారు 540 లీటర్లు అవసరం అవుతుంది. 100 ఫ్లాట్లు ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌కు రోజుకు దాదాపు 54 వేల లీటర్ల నీరు, 300 ఫ్లాట్లు ఉన్న ఒక హై-రైజ్ అపార్ట్‌మెంట్‌కు 1.62 లక్షల లీటర్లకు పైగా నీటి అవసరం ఉంటుంది.
హైదరాబాద్ వంటి నగరాల్లో వందలాది ఇలాంటి అపార్ట్మెంట్లు నిర్మితమవుతున్న నేపథ్యంలో.. ప్రతిరోజు కోట్ల లీటర్ల నీటి అవసరం ఏర్పడుతోంది. ఇది అభివృద్ధిని వ్యతిరేకించే అంశం కాదు. కానీ ప్రతి కొత్త నిర్మాణంతో పాటు నీటి అవసరం కూడా పెరుగుతుందనే వాస్తవాన్ని గుర్తించి, ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. నేడు నిర్మిస్తున్న భవనాలు కేవలం ఈ తరం కోసమే కాదు, రాబోయే 50 నుంచి 100 సంవత్సరాల వరకు ఉపయోగంలో ఉంటాయి. అందువల్ల వాటి నీటి భద్రతపై ఇప్పటినుంచే దృష్టి పెట్టాలి.
అభివృద్ధితో పాటు జలభద్రత కూడా అవసరం
హై-రైజ్ అపార్ట్మెంట్లు నిర్మించడం అభివృద్ధిలో భాగమే. అయితే ప్రతి భారీ నిర్మాణ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే సమయంలో నీటి లభ్యత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగం వంటి అంశాలను కూడా సమానంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రతి పెద్ద అపార్ట్మెంట్లో సమర్థవంతమైన రైన్‌వాటర్ హార్వెస్టింగ్, తగిన సంఖ్యలో రీఛార్జ్ పిట్లు, మురుగునీటి శుద్ధి (ఎస్‌టీపీ) ద్వారా నీటి పునర్వినియోగం, నీటి వినియోగంపై శాస్త్రీయ నిర్వహణ వంటి అంశాలు తప్పనిసరిగా అమలైతే నగరాలపై పడే నీటి ఒత్తిడిని గణనీయంగా తగ్గించవచ్చు.
వర్షపు నీరు... ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన వరం
ప్రతి వర్షాకాలంలో ప్రకృతి కోట్ల లీటర్ల నీటిని మనకు ఉచితంగా అందిస్తోంది. కానీ దానిని భూమిలోకి చేర్చడంలో మనం విఫలమైతే, కొన్ని నెలల తరువాత అదే నీటిని ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఆర్థిక భారం మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు మనం వదిలిపెట్టే సమస్య కూడా. నీటిని ఆదా చేయడం ఒక అలవాటు మాత్రమే కాదు. అది సమాజం పట్ల మన బాధ్యత. నేడు భూమిలోకి చేర్చే ప్రతి వర్షపు చుక్క రేపు తాగునీటిగా తిరిగి మన ముందుకు వస్తుంది.
- నాగులపల్లి వెంకటేశ్వరరావు,కార్యదర్శి,తెలంగాణ మీడియా అకాడమీ
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
