మీ వీడియో డిలీట్ చేసినందుకు క్షమించండి: ప్రధాని మోడీకి ఫేస్‎బుక్ సారీ

మీ వీడియో డిలీట్ చేసినందుకు క్షమించండి: ప్రధాని మోడీకి ఫేస్‎బుక్ సారీ

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నిరసనలను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఫేస్‎బుక్‎లో ప్రధాని మోడీ సెల్ఫీ వీడియో కనిపించకుండా పోయింది. తర్వాత కాసేపటికి ఆ వీడియో మళ్లీ ఎఫ్‎బీలో ప్రత్యక్షమైంది. ఫేస్ బుక్ లో మోడీ వీడియో తొలగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ సెల్ఫీ వీడియో తొలగింపు ఇష్యూపై ఫేస్‎బుక్ మాతృ సంస్థ మెటా స్పందించింది. మోడీ వీడియో తొలగింపు ఘటనపై మెటా క్షమాపణలు చెప్పింది. సాంకేతిక లోపం కారణంగా ఈ పొరపాటు జరిగినట్లు తెలిపింది. తప్పును గుర్తించిన వెంటనే తిరిగి ప్రధాని సెల్ఫీ వీడియోను పునరుద్ధరించినట్లు పేర్కొంది. 

మెటాపై ప్రభుత్వం గుర్రు..!

ఫేస్ బుక్‎లో ప్రధాని మోడీ సెల్ఫీ వీడియో తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్స్‌కు సమన్లు ​​పంపింది. ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టిన అధికారులు.. వీడియోను ఎందుకు తొలగించారో వివరించమని మెటా ఉన్నతాధికారులను కోరారు.

విద్యార్థుల నిరసనలపై ప్రధాని రియాక్షన్:

నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ మార్చ్ తీవ్ర హింసాత్మకంగా మారింది. నిరసనకారులపై పోలీసులు దమనకాండ కొనసాగించారు. విద్యార్థులపై విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నిరసనలపై ప్రధాని మోడీ తొలిసారి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ చేశారు.