రాష్ట్రంలో పేద విద్యార్థులు సైతం ఇంజినీరింగ్ విద్యకు అర్హులే అని గత ప్రభుత్వాలు తీసుకువచ్చిన అనేక విధానాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీర్లుగా మారి దేశ నిర్మాణంలో తమదైన పాత్రను పోషించారు. ఎప్పుడైతే విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యవైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారో ఆ రోజునుంచి ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల పేరుతో ఇంజినీరింగ్ విద్యను వ్యాపార మయం చేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 250కి పైగా ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కళాశాలలు ఉన్నాయి. గతంలో అన్ని కాలేజీలకు ఒకే రకమైన ఫీజు ఉండేది. అన్ని కళాశాలలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మీద మాత్రమే ఆధారపడి కళాశాలలు నడిపేవారు. ఎప్పుడైతే యాజమాన్యాలు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతోపాటు ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఎదిగాక, మేం చేస్తున్న ఖర్చులకు అనుగుణంగా మా ఫీజులను ఖరారు చేయాలని కోరారు.
అయితే యాజమాన్యాలు మాత్రం ఎప్పటిలాగే రూ.35000 మాత్రమే ఇవ్వండని, విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసిన దాంట్లో మీకు మీ పార్టీల కార్యకలాపాలకు ఇచ్చేది ఎలాగు ఇస్తాం అని చెప్పేసరికి ప్రభుత్వం సైతం ఆమోదించింది. తమ ఖర్చులకు అనుగుణంగా ఫీజులను ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి చైర్మన్‌గా వ్యవహరించే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ ద్వారా రూ.35000 ఉన్న ఫీజులను దాదాపుగా రూ. 1,50,000 నుంచి రూ. 2,00,000 వరకు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం సైతం ఆయా కళాశాలలకు ఫీజును కేటాయిస్తూ జీ ఓలను కూడా ఇస్తున్నది.
ఫీజుల పెంపుకోసం న్యాయస్థానాలకు...
ఫీజులను పెంచినా ఇంజినీరింగ్ కళాశాలల ధనదాహం తీరక కొన్ని కళాశాలలు మళ్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులను సంప్రదించి ఫీజులను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో అందరి వాదన వినిపించుకోవచ్చు. అయితే యాజమాన్యాలు మాత్రం ఇంకా కోర్టు తీర్పు రాకముందే మేం కోర్టుకి వెళ్ళాం, ఫలానా ఫీజు కావాలని కోరాం, ఆ మొత్తం ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ ప్రక్రియను పూర్తిచేస్తాం అని ఫీజులను కట్టించుకోవడం కొసమెరుపు. ఈ ఫీజులే కాకుండా విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశలను ఆదాయ వనరులుగా చూసుకుంటూ స్పెషల్ ఫీజులు, క్యాషన్ డిపాజిట్ ఫీజులు, లైబ్రరీ ఫీజు, బుక్స్ ఫీజు, యూనిఫాం ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, సిఆర్టీ ఫీజు అని మళ్ళీ 20వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు ఫీజులను వసూలు చేస్తున్నారు.
అయితే అనేక కళాశాలల్లో ఈ ఫీజులకు కనీసం ఫీజు చెల్లించినట్లు రిసీప్ట్స్ కూడా ఇవ్వడంలేదు. అంతేకాకుండా ఒక సెక్షనుకి 60 మంది విద్యార్థులు ఉంటే అందులో 18 సీట్లు బి కేటగిరీ అడ్మిషన్స్‌గా ఉంటాయి. ఆ అడ్మిషన్స్ సైతం లక్షల రూపాయలు డొనేషన్స్‌గా తీసుకొని అమ్ముకుంటున్నారు. అయితే కేవలం ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ సంపాదించిన మొత్తాన్ని కళాశాలల యాజమాన్యాలు టీఏఎఫ్ ఆర్ సికి వారికి వచ్చిన ఆదాయంగా సబ్మిట్ చేస్తున్నారు. సంపాదించిన ఆదాయం కంటే చేసిన ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది, కావున ఫీజులను పెంచుకుంటాం అనగానే టీఏఎఫ్ఆర్సీ అధికారులు ఫీజులను పెంచుకోవడానికి అనుమతి ఇస్తున్నారు.
వ్యాపార కోణంలో విద్య
ఈ రిసీప్ట్స్ ఇవ్వకుండా వసూలు చేసిన ఆదాయం ఎక్కడకు పోతోంది? ఒక్కో విద్యార్థి మీద కనీసం 20వేల నుండి 50 వేల రూపాయలు వసూలు చేసిన ఒక్కో కళాశాల కొన్ని కోట్ల రూపాయల నల్ల ధనాన్ని దారి మళ్లిస్తోంది. ఇవే కాకుండా బి కేటగిరీ అడ్మిషన్స్ ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అయితే అవి ప్రభుత్వానికి సమర్పించే ఏ నివేదికలలోనూ కనిపించక పోవడం గమనార్హం. అయితే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా విద్యను వ్యాపార కోణంలో చూసే యాజమాన్యాల తీరు అయితే మారడం లేదు.
వాస్తవానికి మన భారతావనిలో విద్య అనేది ఒక సేవ, వంద రూపాయలు ఖర్చు పెడితే కేవలం 105 రూపాయలు మాత్రమే సంపాదించాలి, అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు 100 రూపాయలు ఖర్చు పెట్టి వెయ్యి రూపాయలు సంపాదించి, ప్రభుత్వానికి టీఏఎఫ్ఆర్సీకి సబ్మిట్ చేసే నివేదికలో మాత్రం 85 రూపాయలే సంపాదించాం అని చూపెడుతున్నారు. అందుకే సంపాదించే దాని కన్నా ఖర్చు ఎక్కువ పెడుతున్నాం అని ఫీజులను పెంచుకుంటున్నారు.
ప్రభుత్వం నియంత్రించాలి
కిరాయి భవనాలు అయితే అనుమతి ఎలా వచ్చింది అని కోర్టు సైతం అడగలేదు, ఫీజు పెంపుకు ఆదేశాలు ఇచ్చింది, ఈ విషయం అప్పట్లో నాతో ఆనాటి టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ గతంలో నేను సిబిఐటి కళాశాల ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమం తెలుసుకొని నన్ను అభినందించి, నాతో ఉన్న చనువుతో ఇలా కళాశాలలు ఫీజు పెంపు కోసం ఏ స్థాయికి వెళతాయో అనే విషయం చెప్పారు.
ఇలా యాజమాన్యాలు చేస్తున్న మోసాలు,కుట్రలు, ముందు ప్రభుత్వాలు, సంబంధిత విశ్వ విద్యాలయాలు ఎన్ని కమిటీలు చేసినా, ఎన్ని ఆకస్మిక తనిఖీలు చేసినా, గౌరవ హైకోర్టులు , సుప్రీంకోర్టు ఎన్ని కమిటీలు వేసి విచారణలు చేసినా ఈ ఫీజుల దోపిడీ ఆగడం లేదు. కావున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తమ ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా అసలు ఫీజు రిసీప్ట్స్ ఇవ్వకుండా ఒక్కో కళాశాలలో ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు, ఒక్కో మేనేజ్‌మెంట్ అడ్మిషన్‌కి ఎంతెంత డొనేషన్లు తీసుకుంటున్నారు, ఆయా అక్రమ సంపాదనను సక్రమ సంపాదనగా ఎలా మారుస్తున్నారు అనే పక్కా సమాచారం తెలుసుకోవాలి. ఆ లెక్కలు తెప్పించుకునేలా ప్రణాళికలు రచించి ఫీజుల దోపిడీని నియంత్రించాలని తెలంగాణ పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.
- జవ్వాజి దిలీప్ సాహు. స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం-
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
