- రూ.110 కి బదులు 600 నుంచి వెయ్యి వరకు వసూలు
- అనంతరం టెంపరరీ అడ్రస్ తో ఏఎల్వోలకు అప్లికేషన్లు
- కొంతమంది ఆఫీసర్ల సపోర్టుతో సాగుతున్న బాగోతం
- నేరుగా దరఖాస్తు చేస్తే నెలల తరబడి పెండింగ్
హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో లేబర్ కార్డుల దందా జోరుగా నడుస్తోంది. గతేడాది భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు అమలు చేసే పథకాలకు ఎక్స్ గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో లేబర్ కార్డులకు ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో కొంతమంది దళారులు లేబర్ కార్డులు చేయిస్తామంటూ ఊరూరు తిరుగుతున్నారు. సాధారణంగా రూ.110 చెల్లించి మీ సేవా కేంద్రంలో అప్లై చేస్తే సరిపోయే దానికి అన్నీ తామే చూసుకుంటామంటూ రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు గుంజుతున్నారు. ఆఫీసర్లతో ఒప్పందం మేరకు ఇలా పెద్ద మొత్తంలో వసూలు చేస్తుండగా, బ్రోకర్ ద్వారా వెళ్లిన అప్లికేషన్లను మాత్రమే ఆఫీసర్లు వెంటనే అప్రూవ్ చేస్తున్నారు. ఒకవేళ నేరుగా లబ్ధిదారులు మీసేవా కేంద్రంలో అప్లై చేసుకుంటే దానిని పెండింగ్ లో పెడుతున్నారు.
సాయం పెరగడంతో కార్డులకు డిమాండ్..
రాష్ట్రంలోని భవన, ఇతర నిర్మాణ రంగంలోని 54 విభాగాల కార్మికులకు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కింద ప్రభుత్వం అనేక బెనిఫిట్స్ అమలు చేస్తోంది. గతంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కింద చేరిన సభ్యులు సహజ మరణం సంభవిస్తే బాధిత కుటుంబానికి రూ.లక్ష, యాక్సిడెంటల్ డెత్ అయితే రూ.6 లక్షలు ఇచ్చేవారు.
కానీ, రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కార్మికులకు అందించే సాయాన్ని గణనీయంగా పెంచింది. యాక్సిడెంటల్ డెత్ అయితే రూ.10 లక్షలు, సహజ మరణమైతే రూ.2 లక్షలు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో పాటు లేబర్ కార్డు కలిగిన వ్యక్తి లేదా వారి కుమార్తె వివాహానికి రూ.30 వేలతో పాటు ప్రసూతి సేవల కోసం రూ.30 వేలు, మరణం సంభవిస్తే దహన సంస్కారాలకు రూ.30 వేలు, యాక్సిడెంట్ లో గాయపడి పని చేయలేని పక్షంలో రూ.4 లక్షలు, పూర్తిగా అంగవైకల్యం కలిగితే రూ.5 లక్షలు ఇస్తున్నారు. గతంలో ఉన్న సాయాన్ని ప్రభుత్వం పెంచడంతో క్షేత్రస్థాయిలో లేబర్ కార్డులకు డిమాండ్ పెరిగింది.
టెంపరరీ చిరునామాతో దందా..
లేబర్ కార్డుల ద్వారా దందా మొదలు పెట్టిన దళారులతో లేబర్ డిపార్ట్మెంట్ కు చెందిన కొంతమంది ఆఫీసర్లు కూడా కుమ్మక్కు అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి కార్మికులు పర్మినెంట్ అడ్రస్ తో పాటు టెంపరరీ అడ్రస్ నుంచి కూడా లేబర్ కార్డులకు అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో జనాల నుంచి లేబర్ కార్డుల కోసం డబ్బులు వసూలు చేస్తున్న దళారులు తమకు అనుకూలంగా వ్యవహరించే ఆఫీసర్ కు దరఖాస్తు వెళ్లేలా టెంపరరీ చిరునామాతో అప్లికేషన్ పెడుతుండటం గమనార్హం. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం హనుమకొండ ఏఎల్వో పరిధి కాగా, ఇటీవల కొంతమంది బ్రోకర్లు కాజీపేట సర్కిల్ పరిధిలోకి వెళ్లేలా దరఖాస్తు పెట్టారు.
అనంతరం ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే నాలుగైదు రోజుల్లోనే అప్లికేషన్ ను అప్రూవ్ చేయించి లేబర్ కార్డులు కూడా కార్మికులకు అందించడం ఈ దందాకు అద్దం పడుతోంది. నేరుగా మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకున్న కార్మికుల అప్లికేషన్లు రోజులు, నెలల తరబడి పెండింగ్ లో పెడుతుండగా దళారి ద్వారా వెళ్లిన దరఖాస్తులు మాత్రం వెంటనే అప్రూవ్ చేసి కార్డులు జారీ చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే కార్మికులకు ఆర్థిక సాయం క్లయిమ్స్ విషయంలో పెద్దఎత్తున దందా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, ఇప్పుడు కార్డుల జారీ చేయడంలోనూ బ్రోకర్లు పెద్ద మొత్తంలో దండుకుంటుండటం కలకలం రేపుతోంది. ఇప్పటికైనా లేబర్ కార్డుల జారీ పేరున జరుగుతున్న దందాకు చెక్ పెట్టడంతో పాటు దళారులకు సహకరిస్తున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కార్డుకు రూ.వెయ్యి వరకు వసూలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 3.5 లక్షల వరకు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కింద కార్మికులుగా నమోదై ఉన్నారు. ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా పెంచడంతో చాలామంది కార్మికులుగా నమోదు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. నమోదు చేసుకునేందుకు 18 నుంచి 59 ఏండ్ల మధ్య వయసు కలిగి ఉండి పాస్ పోర్టు సైజ్ ఫొటో, మెంబర్ షిప్ ఫీజు రూ.50, ఐదేండ్ల రిజిస్ట్రేషన్ కోసం మరో రూ.60 మొత్తంగా రూ.110 చెల్లించి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
అనంతరం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు వెరిఫై చేసి కార్మికులకు లేబర్ కార్డు జారీ చేస్తుంటారు. ఇదంతా జనాలకు అవగాహన లేదు. దాంతో పాటు దళారి లేనిదే లేబర్ ఆఫీస్ లో పని కాదనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది దళారులు లేబర్ కార్డులు చేయిస్తామంటూ ఊరూరు తిరుగుతున్నారు. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయడంతో పాటు అప్లికేషన్ అప్రూవ్ చేయించి, కార్డు తీసుకొస్తామని జనాలకు చెబుతున్నారు. సాధారణంగా కార్డుకు రూ.110 చెల్లించాల్సి ఉంటే, రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని వివిధ చోట్ల కొంతమంది దాదాపు రూ.వెయ్యి వరకు తీసుకున్నారు.
