- 2030 నాటికి మానవ మేధను మించనున్న ఏఐ
- అదే జరిగితే.. మనుషులందరినీ హతమార్చే చాన్స్ 10% కన్నా ఎక్కువే
- అణ్వాయుధాల కన్నా ప్రమాదకరంగా మారే అవకాశం
- ఏఐ అభివృద్ధిపై బ్రిటన్, అమెరికా చట్టసభల ఆందోళన
- ఏఐ అభివృద్ధిని ఆపేయాలి.. ఏఎస్ఐని బ్యాన్ చేయాలి
- రక్షణ కోసం కఠిన చట్టాలు చేయాలంటూ డిమాండ్లు
- ఏఐ స్పీడ్ తగ్గించాలన్న మస్క్, అమోడీ, ఆల్ట్‌మన్
సెంట్రల్ డెస్క్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ముప్పు వేగంగా ముంచుకొస్తోంది. ఇప్పటికే డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, ఆటోమేటిక్ మాల్‌వేర్‌లు, సైబర్ అటాక్స్‌తో కలకలం సృష్టిస్తున్న ఏఐని మరింత అడ్వాన్స్‌డ్ స్థాయికి తీసుకెళ్లేందుకు కంపెనీలు పోటాపోటీగా పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని రంగాల్లోనూ ఏఐ వాడకానికి బాటలు వేసిన ఏఐ కంపెనీలు.. ఇప్పుడు మనుషుల కన్నా లక్షల రెట్లు తెలివిమీరి ఆలోచించే ఆర్టిఫిషియల్ సూపర్‌ఇంటెలిజెన్స్(ఏఎస్‌ఐ) సృష్టి దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నాయి.
ఈ పోటీ ఇలానే సాగితే మరో పదేళ్లలోనే ఆర్టిఫిషియల్ సూపర్‌ఇంటెలిజెన్స్ రావడం ఖాయమని.. అదే జరిగితే మానవ జాతి మనుగడకే ముప్పు రావచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2030 నాటికి ఏఎస్ఐ వస్తుందని.. దాని వల్ల మనుషులందరినీ అంతం చేసే అవకాశం 10 శాతం కన్నా ఎక్కువే ఉందని ఎక్స్‌పర్ట్‌లు హెచ్చరిస్తున్నారు.
ఈ అంశంపై ఇటీవల అమెరికా, బ్రిటన్ పార్లమెంట్‌లలో సైతం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ డెవలప్‌మెంట్‌కు తక్షణమే బ్రేక్ వేయాలని.. ఏఎస్ఐ అభివృద్ధిని బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. అలాగే, భవిష్యత్తులో ఏఐని నియంత్రించేందుకు కఠిన నిబంధనలు అమలులోకి తేవాలని.. ఏఐ మోడల్స్ దారితప్పి మనుషులకు ముప్పుగా మారితే వాటిని మనుషులు తొలగించేందుకు ‘కిల్ స్విచ్’లు రూపొందించాలని చెప్తున్నారు.
బ్రిటన్, అమెరికా చట్టసభల ఆందోళన..
ఏఐ వల్ల మానవాళికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందా? అనే అంశంపై లండన్‌లోని బ్రిటన్ పార్లమెంట్ లో ఎంపీలు, ఇతర నేతలతో 'కంట్రోల్ ఏఐ' సంస్థ ఇటీవల ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా బ్రిటన్ రక్షణ శాఖ మాజీ మంత్రి డిస్ బ్రౌన్, కాలిఫోర్నియా వర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ స్టువర్ట్ రస్సెల్ మాట్లాడుతూ..అణు ఆయుధాల కంటే ఏఐయే పెద్ద ప్రమాదమని తెలిపారు. దానిపై నియంత్రణ లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారు. చెర్నోబిల్ అణు ప్రమాదం తరహా పెను విపత్తు సంభవించే ప్రమాదం ఉందన్నారు. 2017 నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న బీట్రిస్ ఫిన్ (స్వీడన్) మాట్లాడుతూ.. ఏఎస్ఐ రూపంలో పెను ముప్పు ముంచుకొస్తోందని హెచ్చరించారు.
ఈ క్రమంలో బ్రిటన్ లో అధికార లేబర్ పార్టీకి చెందిన ఎంపీ అలెక్స్ సోబెల్..ఏఎస్ఐ సృష్టిని నిషేధించాలని ఒక కొత్త బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఏఐ నియంత్రణకు చట్టపరమైన కఠిన నిబంధనలు తీసుకురావాలని కోరారు. అలాగే, అమెరికా కాంగ్రెస్‌లో సెనేటర్ బెర్నీ శాండర్స్, ప్రతినిధి గ్రెగ్ కాసార్ కూడా ఏఐ నియంత్రణ చట్టాలను ప్రతిపాదించారు.
ఏఐ డెవలప్‌మెంట్‌ను ఆపేయాలని.. సూపర్‌ఇంటెలిజెన్స్‌ను నిషేధించాలని వారు డిమాండ్ చేశారు. అయితే, ఆంత్రోపిక్ సంస్థ రీసెర్చర్ ఎవెన్ హుబింగర్ (అమెరికా).. ఏఐ చాలా ప్రమాదకరంగా మారనుందని 'ఎక్స్' వేదికగా హెచ్చరించారు. రాబోయే దశాబ్దంలో ఏఐ మనుషులందరినీ అంతం చేసే అవకాశం 10% కంటే ఎక్కువగా ఉందని వెల్లడించారు. వీటిని నియంత్రించడానికి చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి ఆంత్రోపిక్ సంస్థలో తన సహోద్యోగి రాజీనామా చేసిన తర్వాత హుబింగర్
ఈ పోస్ట్ పెట్టారు.
మానవాళి ప్రాణాలతో టెక్ జూదం
ఏఐ అనేది ప్రస్తుతం మనుషుల లాగా ఆలోచించడం, కోడింగ్ రాయడం, చిత్రాలు గీయడం వంటి నిర్దిష్ట పనులను చేయగల సాంకేతికత కాగా.. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ఏఎస్ఐ) అనేది మానవ మేధస్సును అన్ని రంగాలలోనూ లక్షల రెట్లు దాటిపోయి స్వయంగా నిర్ణయాలు తీసుకోగలదని చెప్తున్నారు. అయితే, ఏఎస్ఐ మానవ మేధస్సును మించిపోతే దానిపై మనుషులు నియంత్రణ కోల్పోతారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేట్ కంపెనీలు భద్రతను పూర్తిగా గాలికొదిలేసి కేవలం మార్కెట్లో ముందుండాలనే ఉద్దేశంతో ఏఐ డెవలప్మెంట్ రేసులో దూసుకెళ్లడం మానవాళి ప్రాణాలతో జూదం ఆడటమేనని ఆంత్రోపిక్ రీసెర్చర్ జాకోబ్ కాక్సన్ ఆరోపిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్, ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ, ఎక్స్ఏఐ అధినేత ఎలాన్ మస్క్ కూడా అంగీకరించారు. కానీ, కేవలం వేగాన్ని తగ్గించడం సరిపోదు.. ఏఐ అభివృద్ధికి తక్షణమే బ్రేక్ వేయాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుత ముప్పులపై దృష్టి పెట్టాల్సిందే
ఏఐ సాంకేతికత వల్ల భవిష్యత్తు ముప్పులతో పాటు పర్యావరణంపై తీవ్ర ప్రభావం, తప్పుడు సమాచారం వేగంగా విస్తరించడం, లక్షలాది ఉద్యోగాలు కోల్పోవడం వంటి సమస్యలు మరింత పెరుగుతాయని ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ సాండ్రా వాచ్టర్ (ఆస్ట్రియా/బ్రిటన్) తెలిపారు. టెర్మినేటర్ సినిమాల్లో చూపినట్లు ఊహాజనిత విపత్తుల గురించి ఆలోచించే బదులు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టాలని ఆమె సూచిస్తున్నారు.
సోఫైర్ డైరెక్టర్ డేవిడ్ బార్బర్ (బ్రిటన్) మాట్లాడుతూ.. ఏఐ అభివృద్ధిని పూర్తిగా ఆపడం సాధ్యం కాదు, అలాగని కంట్రోల్ చేయకుండా వదిలేస్తే పెను ప్రమాదానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, సాంకేతిక నిపుణులు అందరూ కలిసికట్టుగా ఏఐపై ఒక బలమైన నియంత్రణ వ్యవస్థను రూపొందించి, భద్రతకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ఏఐని నడిపించాలని పేర్కొన్నారు.
ఇప్పటికే డేంజర్ బెల్స్..
ఏఐ సైబర్ అటాక్స్: మాల్‌వేర్‌లను రాసేందుకు, ఆటోమేటిక్ సైబర్ అటాక్స్ చేసేందుకు, ఫిషింగ్ స్కామ్‌లకు ఏఐని వాడటం ఇప్పటికే హ్యాకర్లు, సైబర్ క్రిమినల్స్ మొదలుపెట్టేశారు.
డీప్‌ఫేక్స్ అండ్ సోషల్ ఇంజనీరింగ్: డీప్‌ఫేక్ ఆడియో, వీడియోలతో పెద్ద ఎత్తున తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. ఫైనాన్షియల్ మార్కెట్లను మానిప్యులేట్ చేయడంతోపాటు ఐడెంటిటీ థెఫ్ట్ వంటి నేరాలకు పాల్పడుతున్నారు. జాబ్ ఆటోమేషన్ & ఎకనమిక్ డిస్‌ప్లేస్‌మెంట్: ఏఐతో ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలకు ఎసరు వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి, ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం నెలకొంది.
డేటా లీకేజ్ & షాడో ఏఐ: కంపెనీలతోపాటు ప్రజల డేటా అంతా ఏఐ మోడల్స్ గుప్పిట్లోకి చేరుతోంది. దీంతో ప్రైవసీ, ఐపీ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. ఆల్గారిథమిక్ బయాస్ & మిస్‌ఇన్ఫర్మేషన్: తప్పుడు డేటాతో ట్రెయినింగ్ వల్ల ఏఐ మోడల్స్ వివక్షాపూరిత నిర్ణయాలు, భ్రమలతో కూడిన సమాచారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో జాబ్స్, ఫైనాన్షియల్, లీగల్ సెక్టార్‌లలో తప్పుడు డేటా వ్యాప్తి అవుతోంది.
భవిష్యత్తు ప్రమాదాలు ఇవే..
ఆటోనామస్ ఏజెంట్లపై కంట్రోల్ పోవడం: మనుషుల ప్రమేయం లేకుండా అన్ని పనులనూ సొంతంగా చేసేలా ఏఐ ఆటోనామస్ ఏజెంట్లు వస్తున్నాయి. ఒకవేళ ఇవి కంట్రోల్ తప్పి మోసపూరిత చర్యలకు పాల్పడితే.. వీటిని నియంత్రించడం కష్టసాధ్యం అవుతుంది. ఆర్టిఫిషియల్ సూపర్‌ఇంటెలిజెన్స్: 2030 నాటికల్లా వస్తుందని చెప్తున్న ఏఎస్ఐ.. అన్ని రంగాల్లోనూ మనుషుల కంటే లక్షల రెట్లు తెలివిమీరిపోతుంది. దాని లక్ష్యాలు, ఉద్దేశాలు మానవ మనుగడకు వ్యతిరేకంగా మారితే గనక.. దానిని మనుషులు కంట్రోల్ చేయడం అసాధ్యం. అప్పుడు ఏఐఎస్ఐ చేసే విధ్వంసానికి మానవ జాతి అంతమయ్యే ముప్పు వస్తుంది.
లక్ష్యాల సాధనకు దారి తప్పొచ్చు: మనుషులు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి సూపర్‌ఇంటెలిజెంట్ సిస్టమ్ అత్యంత ప్రమాదకరమైన, ఊహించని షార్ట్‌కట్‌లను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, ఒక సమస్యను పరిష్కరించాలని ఏఎస్ఐకి చెప్తే.. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మానవ జోక్యాన్ని లేదా పోటీని తొలగించడమే సరైన మార్గమని అది భావించవచ్చు.
బయోసెక్యూరిటీ & టెక్నాలజీ ముప్పు: అధునాతన ఏఐ మోడళ్లను భవిష్యత్తులో దారితప్పిన ఆటోనామస్ ఏఐ సిస్టమ్‌లు దుర్వినియోగం చేయవచ్చు. వాటిని కొత్త ప్రమాదకరమైన వైరస్‌లను (బయోలాజికల్ పాథోజెన్స్) డిజైన్ చేయడానికి లేదా కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడులు చేయడానికి ఉపయోగించుకునే ప్రమాదం ఉంది.
