ప్రముఖ సంస్థ జాన్సన్ & జాన్సన్ (J&J) బేబీ పౌడర్ వివాదానికి సంబంధించి ఓ ఒప్పందానికి వచ్చింది. కంపెనీ టాల్క్ బేస్డ్ బేబీ పౌడర్ వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందంటూ బాధితులు చేసిన వేల కేసులను పరిష్కరించుకునేందుకు ఏకంగా 5.5 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో వేల కోట్ల రూపాయలు చెల్లించేందుకు సంస్థ అంగీకరించింది. దింతో దశాబ్దాలుగా కంపెనీని వేధిస్తున్న ఈ న్యాయ పోరాటానికి ఈ ఒప్పందంతో తెరపడే అవకాశం ఉంది.
ఎన్ని కేసులు క్లియర్ అవుతాయంటే:
న్యూజెర్సీ కోర్టుతో పాటు ఇతర రాష్ట్రాల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న దాదాపు 76 వేల క్లెయిమ్‌లకు ఈ ఒప్పందం వర్తిస్తుంది. కంపెనీపై మిగిలి ఉన్న దాదాపు అన్ని టాల్క్ కేసులకు దీనివల్ల పరిష్కారం దొరుకుతుంది. అయితే, టాల్క్‌లో ఆస్బెస్టాస్ ఉండి మెసోథెలియోమా క్యాన్సర్ సోకిందన్న కేసులను కంపెనీ ఎప్పుడో సెటిల్ చేసుకుంది.
అయితే కోర్టులో ఉన్న అండాశయ క్యాన్సర్ బాధితుల్లో కనీసం 95% మంది ఈ ఒప్పందానికి అంగీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఈ సెటిల్మెంట్ పూర్తిగా అమలవుతుంది.
దీనికి సంబంధించి జే&జే సంస్థ 2027లో 3 బిలియన్ డాలర్లు, ఆ తర్వాత 2028లో మిగతా మొత్తం చెల్లించాలని భావిస్తోంది. బాధితుల స్పందనను బట్టి ఈ మొత్తం భవిష్యత్‌లో ఇంకా పెరిగే అవకాశం ఉందని న్యాయవాదులు అంటున్నారు. మొత్తంగా ఈ మొత్తం $7 బిలియన్ల వరకు కూడా చేరవచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం 18 నెలల్లోపే బాధితులందరికీ డబ్బులు అందేలా వేగంగా ఈ ప్రక్రియ జరగనుంది.
మా పౌడర్ వల్ల క్యాన్సర్ వస్తుందన్న ఆరోపణలను జే&జే మొదటి నుంచి ఖండిస్తూనే టాల్క్ పౌడర్ పూర్తిగా సురక్షితమైనదని చెబుతోంది. అయిన, ఈ వివాదానికి ముగింపు పలికి.. ప్రాణాలు కాపాడే ఇతర మందులు, వైద్య పరికరాల తయారీపై దృష్టి పెట్టేందుకే ఈ రాజీకి ఒప్పుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ ఒప్పందం కేవలం ఇప్పటివరకు ఉన్న కేసులకు మాత్రమే వర్తిస్తుంది. భవిష్యత్తులో వచ్చే కొత్త కేసులకు ఇది వర్తించదు. ఈ వివాదాల నేపథ్యంలో జే&జే సంస్థ 2020లోనే అమెరికాలో టాల్క్ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపివేసి, పూర్తిగా మొక్కజొన్న పిండి (కార్న్‌స్టార్చ్)తో తయారు చేసే పౌడర్‌ను మాత్రమే విక్రయిస్తోంది.
ఇన్నాళ్లు కోర్టులో ఎన్నో వాయిదాలు చూసిన ఈ వివాదం, ఎట్టకేలకు భారీ సెటిల్‌మెంట్‌తో ఒక కొలిక్కి వస్తుండటంతో ఇటు కంపెనీకి, అటు బాధితులకు ఊరట లభించినట్టయింది.
