ఎడారి దేశాల్లో మిస్సింగ్..10 ఏండ్లైనా దొరకని ఆచూకీ

ఎడారి దేశాల్లో మిస్సింగ్..10 ఏండ్లైనా దొరకని ఆచూకీ

నిజామాబాద్, వెలుగు: ఉపాధి కోసం ఎడారి దేశాలకు వెళ్లిన పలువురు తెలంగాణ వాసులు ఏమయ్యారో అంతుచిక్కడంలేదు. ఒకటి రెండు కాదు 10 ఏండ్లకు పైగా ఆచూకీ లేకపోవడంతో కుటుంబీకులు ఆందోళనకు గురవుతున్నారు. 30 ఏండ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడి రైతులు, నిరుద్యోగులు గల్ఫ్​ దేశాలు కువైట్, షార్జా, దుబాయ్, అబుదాబి, జెడ్డా, సౌదీ ఆరేబియా, రియాద్, బెహరాన్ ​తదితర దేశాలకు వలస వెళ్లారు. తాజా లెక్కల ప్రకారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని 6 లక్షల మంది వరకు గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లారు. ఒక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే  లక్షన్నర వరకు గల్ఫ్ బాట పట్టారు. ఎడారి దేశాలకు వెళ్లిన తెలంగాణవాసుల్లో దాదాపు 89 మంది ఆచూకీ దొరకడం లేదు. పదేండ్ల క్రితమే వారితో కుటుంబీకులకు సంబంధాలు తెగిపోయాయి. 

పర్మిషన్​ లేకుండా కంపెనీ మారితే..

గల్ఫ్​ దేశాల్లో వర్క్ ​అగ్రిమెంట్​ ప్రకారం యజమాని అంగీకారంతోనే కంపెనీలు మారాల్సి ఉంటుంది. అయితే వర్క్​ అగ్రిమెంట్​ఉల్లఘించడంతో చిక్కులు తప్పడం లేదు. కొందరు యజమానులు తమ ఎంప్లాయీస్​ ఇతర పోటీ సంస్థల్లో పని చేయడం ఇష్టంలేక కోర్టులను ఆశ్రయిస్తున్నారు. గల్ఫ్​ దేశాల్లో చట్టాలు కఠినంగా ఉండడంతో కొందరు జైలు పాలయిన ఘటనలూ ఉన్నాయి. 10 నుంచి దాదాపు 30 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేస్తున్నారు. గల్ఫ్​ దేశాల్లోని జైళ్లల్లో దశాబ్దాల తరబడి కార్మికులు మగ్గుతున్నారు. చాలా సందర్భాల్లో ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే కార్మికులను బద్దూస్(పర్యవేక్షకులు)లు మా దగ్గరే మీ  పని అంటూ ఫాంహౌజ్​లకు తీసుకువెళ్లి ఎడారి ప్రాంతాల్లో పని చేయిస్తుంటారు. అక్కడ వారు పెట్టే చిత్రహింసలు భరించలేక చాలామంది పని వదిలి పారిపోతున్నారు. పాస్​పోర్ట్,​ వీసా లేకపోవడంతో అరెస్ట్​ అవుతున్నారు. నిజామాబాద్​జిల్లాకు చెందిన 21 మంది, కరీంనగర్​ 23, ఆదిలాబాద్​14, వరంగల్​12, నల్గొండ 5, ఖమ్మం 5, మహబూబ్​నగర్​5, మెదక్​ జిల్లాకు చెందిన 4.. మొత్తం 89 మంది తెలంగాణవాసులు ఇప్పటివరకు మిస్సింగ్​అయినట్టు ఇండియన్​ఎంబసీలో దరఖాస్తులు ఉన్నాయి.

ఎన్ఆర్ఐ పాలసీ ఏమైంది?

ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్​దేశాలకు వెళుతున్న వారి కోసం ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తామని తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఆవిర్భావం వరకు ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీ ఇస్తూ వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ఎన్నికల సందర్భంగా ఎన్ఆర్ఐ పాలసీ తీసుకుచ్చి గల్ఫ్​కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. ఏడేండ్లు దాటుతున్నా ఎన్ఆర్ఐ పాలసీపై ఎలాంటి స్పష్టతా లేదు. సర్కారు​ చేతులెత్తేయడంతో తెలంగాణలోని నిరాక్షరాస్యులైన నిరుద్యోగులు ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. కనీసం కనిపించకుండాపోయిన తమవారి ఆచూకీ కోసం సర్కారు ప్రయత్నించాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు. 

ఎన్ఆర్ఐ పాలసీతో మిస్సింగులుండవ్​

టీఆర్ఎస్​ సర్కారు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తే ఇలాంటి సమస్యలుండవు. రాష్ట్ర సర్కారు ​గల్ఫ్​దేశాల్లో మిస్సింగ్​అయిన వారి ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలి. జాబ్స్​ వీసాలపై అవగాహన లేక అక్కడిపోయి ఇరుక్కుపోతున్నరు. గతంలో ఇట్లనే జరగడంతో ఆయా దేశాల్లో జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్నరు. జైళ్లల్లో ఉంటే సమాచారం ఉండదు. ఎంబసీ ఆఫీస్​సమన్వయంతో సర్కార్​ చర్యలు తీసుకోవాలి.

- బసంత్​రెడ్డి, గల్ఫ్​కార్మికుల సంక్షేమ సంఘం ప్రతినిధి

నిజామాబాద్​ జిల్లా మోర్తాడ్​ గ్రామానికి చెందిన రమేశ్ ​2004లో సౌదీ వెళ్లాడు. మర్వన్​లోని ఫామ్​హౌజ్​లో వాచ్​మన్​గా చేరాడు. 2006, 2008 సంవత్సరంలో గ్రామానికి వచ్చాడు. తిరిగి సౌదీ వెళ్లిన రమేశ్​ ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. 13 సంవత్సరాలుగా రమేశ్​ అత్తాపత్తా లేకపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. భార్య బీడీ కార్మికురాలుగా పని చేస్తుండగా పెద్ద కొడుకు తండ్రి ఆచూకీ దొరుకుతుందని దుబాయ్​లో హెల్పర్​ పనికి వెళ్లాడు. చిన్నకొడుకు సూరజ్​ డిగ్రీ ఫైనలియర్​ చదువుతున్నాడు. తన తండ్రి ఆచూకీ కోసం ఢిల్లీలోని ఇండియన్ ​ఎంబసీలో దరఖాస్తు చేశాడు. 13 ఏండ్లుగా ఎంబసీ చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. 

నిజామాబాద్ ​జిల్లా న్యాలకల్​ గ్రామానికి చెందిన ఉమాపతికి కొడుకు, కూతురు ఉన్నారు. ఉమాపతి డ్రైవర్​ ఉద్యోగం కోసం 2011లో కువైట్​వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఉమాపతి ఎక్కడ ఉన్నాడో, ఏమయ్యాడో కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు ఆచూకీ లేదు. కుటుంబీకుల దగ్గర కనీసం ఏజెంట్​ అడ్రస్ ​కూడా  లేకపోవడంతో దిక్కు తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉమాపతి కొడుకు అభి చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. కూతురు ఆకాంక్ష డిగ్రీ చదువుతోంది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన ఉషాభానుకు నలుగురు కూతుళ్లు. భర్త ఆసరా లేకపోవడం, కుటుంబ భారం మీద పడడంతో రెండేండ్ల క్రితం కువైట్​లో ఉద్యోగానికి వెళ్లింది. అప్పటి నుంచి కూతుళ్లతో టచ్​లోనే ఉంది. అయితే గత 12 రోజులుగా ఆమె కాంటాక్ట్​లో లేకపోవడంతో ఉషాభాను సహోద్యోగులను సంప్రదించగా కనిపించడం లేదనే సమాచారం అందింది. తమ తల్లి ఆచూకీ కోసం నలుగురు ఆడపిల్లలు  తల్లడిల్లుతున్నారు.