- వైన్స్ నిర్వాహకులకు ‘ఐటీ’ షాక్
- ఇప్పటికే పలువురికి నోటీసులు
- వైన్స్ నిర్వాహకుల్లో ఆందోళన
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో వైన్స్ షాపుల నిర్వాహకులకు ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ నోటీసులు జారీ చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలో 82 వైన్స్ ఉన్నాయి. వీటిలో గౌడ్స్కు 21, ఎస్సీలకు 7, ఎస్టీలకు ఒకటి రిజర్వ్ కాగా, ఓపెన్ కేటగిరిలో 53 ఉన్నాయి. రిజర్వ్డ్ కేటగిరీలో షాపులు పొంది, ఇతరులకు గుడ్‌విల్ పేరుతో విక్రయించిన వారు లేదా బినామీలుగా ఉన్న వారిపై ఐటీ నిఘా పెట్టింది. 2021–-22 ఆర్థిక సంవత్సరం నుంచి ‘మీ ఆదాయ వనరులేంటి? వైన్స్ అప్లికేషన్ ఫీజు రూ. 3 లక్షలు, వాయిదాల వారీగా చెల్లిస్తున్న లక్షల్లో సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది’ అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ 1988 కింద నోటీసులు ఇవ్వడంతో నిర్వాహకుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
ఈ నోటీసుల నేపథ్యంలో 2025 ఏప్రిల్ 1 నుంచి జరిగిన బ్యాంక్ లావాదేవీలు, పార్టనర్ల వివరాలు, షాపు అద్దె ఒప్పందాలు, పని చేసే సిబ్బంది జీతాల రికార్డులతో సహా హైదరాబాద్‌లోని కార్యాలయానికి హాజరుకావాలని ఐటీ శాఖ ఆదేశించింది. చాలా చోట్ల అసలు లైసెన్సుదారులు ఒకరుండగా, తెర వెనుక వ్యాపారాన్ని ఇతరులు నడిపిస్తుండటంతో ఇప్పుడు లెక్కలు చూపలేక కొందరు, గుడ్‌విల్ కింద తీసుకున్న సొమ్ముకు సమాధానం చెప్పలేక మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలువురు విచారణకు హాజరుకాగా, ఎక్సైజ్ శాఖ, నిర్వాహకులు ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.
