హైదరాబాద్ లో డిఫరెంట్ టేస్టీ, ఫ్లేవర్స్ తో ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సంస్థలు పిస్తా హౌస్, షా గౌస్ ఓనర్స్ ఇండ్లలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మంగళవారం (నవంబర్ 18) ఉదయం ప్రధాన కార్యాలయాలతో పాటు ఇండ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ప్రతి ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్న ఈ హోటల్స్ లావాదేవీలపై తనిఖీలు చేపట్టారు.
రాజేంద్రనగర్ లోని పిస్తా హౌస్ ఓనర్స్ మహమ్మద్ మజీద్ , మహమ్మద్ ముస్తాన్ ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు ఐటి అధికారులు. రికార్డుల్లో చూపిన ఆదాయానికి, నిజమైన ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. హవాలా, నకిలీ లావాదేవిలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉన్నట్లు ఆరోపణలు ఉండటంతో రైడ్స్ కు దిగిన అధికారులు.. ట్యాక్స్ చెల్లింపులో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు.
మొత్తం నాలుగు టీమ్స్ గా ఏర్పడి సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. పిస్తా హౌస్ ఓనర్ మాజిద్ రాజేంద్రనగర్ పరిధిలోని గోల్డెన్ హైట్స్ కాలనీలో నివాసముంటున్నారు. తనిఖీల కారణంగా ఇంట్లోకి ఎవరినీ రానీయకుండా నిబంధనలు విధించారు. పలు ఫైల్లు, డ్యాకుమెంట్లు, బ్యాంకు స్టేట్ మెంట్స్ తో పాటు ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాల లెక్కలపై ఆరా తీస్తున్నారు.
గత నెలలో.. గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రం సమీపంలోని వీ కేర్ సీడ్స్, కోల్డ్ స్టోరేజీ, ప్రాసెసింగ్ యూనిట్లలో ఐటీ ఆఫీసర్ల తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. కోల్డ్ స్టోరేజీల ద్వారా భారీ మొత్తంలో నగదు బదిలీ జరిగినట్లు ప్రచారం కావడంతో స్పందించిన ఐటీ ఆఫీసర్లు పలు కోల్డ్ స్టోరేజీలపై దాడులు చేశారు. ఈ క్రమంలో వీ కేర్ కోల్డ్ స్టోరేజ్ ఆఫీస్, గోడౌన్‌లో నిల్వఉన్న ధాన్యం స్టాక్ రిజిస్టర్లు, పంటల వివరాలను పరిశీలించి పలు వివరాలను సేకరించారు.
సికింద్రాబాద్మానేపల్లి జ్యువెలర్స్లో ఐటీ అధికారులు అక్టోబర్లో సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు దుకాణంలోని పలు డాక్యుమెంట్లు పరిశీలించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నా యన్న ఫిర్యాదుల మేరకు ఐటీ అధికారులు సోదాలను నిర్వహించారు.
