కరోనాకు మనిషిని చంపేంత శక్తి లేదు

కరోనాకు మనిషిని  చంపేంత శక్తి లేదు
  • ఆరునెలల అనుభవంలో తెలిసిపోయింది
  • ప్రపంచంలో ఎక్కడైనా కరోనాకు ఒక్కటే ట్రీట్​మెంట్
  • కార్పొరేట్ హాస్పిటల్స్​కు వెళ్లి డబ్బు ఖర్చు చేసుకోవద్దు
  • ఆశా వర్కర్లు, ఏఎన్​ఎంలు ఇప్పుడే రిలాక్స్ కావొద్దు
  • హెల్త్​ మినిస్టర్ ఈటల

హైదరాబాద్, వెలుగు‘‘కరోనాకు మనిషిని చంపేంత శక్తి లేదు. ఇది ఆరు నెలల అనుభవంలో తెలిసిపోయింది. 99 శాతం మంది కరోనా నుంచి బయటపడుతున్నరు. ఇప్పుడు ప్రతి ఇంట్లోకి కరోనా వచ్చింది. భయాన్ని పక్కనపెడితే  కరోనాను ఈజీగా జయించొచ్చు’’ అని హెల్త్​ మినిస్టర్ ఈటల రాజేందర్ అన్నారు.  ప్రపంచంలో ఎక్కడైనా కరోనాకు ట్రీట్​మెంట్​ఒక్కటేనని, అనవసరంగా కార్పొరేట్ హాస్పిటల్స్​కు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని ఆయన సూచించారు. సర్కారు హాస్పిటల్స్​లో ప్లాస్మా థెరపీ కూడా చేస్తున్నామని చెప్పారు. ఊళ్లలో కరోనా పాజిటివ్ వ్యక్తులను మొదటి రోజే గుర్తిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఆదివారం  హైదరాబాద్​ నుంచి జూమ్​ మీటింగ్​లో 22 వేల మంది ఆశావర్కర్స్, 500 మంది ఏఎన్ఎంలతో మంత్రి ఈటల రాజేందర్​ మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వచ్చిన మొదటిరోజు నుంచి హెల్త్ వారియర్స్​ కంటిమీద కునుకులేకుండా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. సీజనల్​ డిసీజెస్​, కరోనా ఒకటే లక్షణాలు కలిగి ఉన్నాయని, సాధ్యమైనంత తొందరగా టెస్టులు చేసి నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ర్యాపిడ్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన వారికి లక్షణాలుంటే, తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయాలన్నారు. ఇప్పుడే రిలాక్స్ అవ్వొద్దని, జనవరి వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు.  ఏఎన్​ఎం, ఆశా వర్కర్ల​ సమస్యలను పరిష్కరిస్తామని, జీతం పెంచే విషయాన్ని సీఎంతో చర్చిస్తామని మంత్రి అన్నారు. కరోనా తర్వాత ప్రతి జిల్లా ఏఎన్​ఎం, ఆశా వర్కర్స్​తో ప్రత్యేకంగా మీటింగ్​నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కరోనా టైమ్​లో బాగా పనిచేసిన వాళ్లను ఆయన
అభినందించారు.