- ఆదివాసీ మహిళలకు పెరగనున్న ఉపాధి అవకాశాలు
- భక్తులు, పర్యాటకుల కొనుగోలుతో గిరిజనుల ఆర్థికాభివృద్ధి
భద్రాచలం, వెలుగు : అడవిలో దొరికే ఆహార ఉత్పత్తులన్నీ ఒకేచోట లభించేలా భద్రగిరి మార్ట్‌ను భద్రాచలంలో ఏర్పాటు చేసేందుకు ఐటీడీఏ సన్నాహాలు చేస్తోంది. గిరిజనులు తయారు చేసిన ఆహార ఉత్పత్తులను ఈ మార్ట్ ద్వారా విక్రయించనున్నారు. ఈ మార్ట్ఏర్పాటుతో మన్యంలోని గిరిజన మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు భక్తులు, పర్యాటకులు కొనుగోలు చేసేందుకు సులభంగా ఉంటుంది. ఇందు కోసం భద్రాచలం పాత మార్కెట్లోని గిరి బజార్భవనాన్ని ఎంపిక చేశారు.
సరికొత్త హంగులతో భవన పునర్నిర్మాణం..
గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలోని గిరి బజార్భవనాన్ని సరికొత్త హంగులతో పునర్నిర్మిస్తున్నారు. ర్యాకులు, లైటింగ్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ డిస్ప్లేలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తారు. పాపికొండల టూరిస్టులు, ట్రైబల్ మ్యూజియం, భద్రాచలం దర్శనానికి వచ్చే భక్తులను ఆకట్టుకునేలా భద్రగిరి మార్ట్ ను తీర్చిదిద్దనున్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలని పీవో బి.రాహుల్ఇప్పటికే ట్రైబల్ వెల్ఫేర్ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ప్రధాని మెచ్చిన ఆహార ఉత్పత్తులు..
ఇటీవల మన్కీబాత్కార్యక్రమంలో ప్రధాని మోదీ భద్రాచలంలో గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్స్ బిస్కెట్లను మెచ్చుకున్నారు. అడవుల్లో దొరికే ఇప్ప పువ్వులతో తయారు చేసిన లడ్డూలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇక్కడ తయారు చేసిన లడ్డూలు లండన్ వరకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఐటీడీఏ అధికారులు భద్రగిరి మార్ట్ పేరుతో షాపును ఓపెన్ చేయనున్నారు. ఈ మార్టు ఏర్పాటు చేస్తే ఆదివాసీ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గిరిజన ఉత్పత్తులకు బ్రాండ్గుర్తింపు, మార్కెటింగ్ లభిస్తుంది. రామనవమి నాటికి ఈ భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అదనపు భవన ర్మాణానికి రూ.15 లక్షలు కేటాయించారు.
100 కుటుంబాలకు ఉపాధి..
అటవీ ఉత్పత్తులు సేకరించే 100 కుటుంబాలకు భద్రగిరి మార్టుల ద్వారా ఉపాధి దొరుకుతుంది. వీరు నిత్యం అడవుల్లోకి వెళ్లి తేనెను సేకరిస్తారు. ప్రధానంగా జిల్లాలోని సుమారు 41 కొండరెడ్ల కుటుంబాలకు ఇది వరంగా మారనుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూపు సభ్యులు నాప్కిన్స్, కందిపప్పు, కుంకుడు కాయలతో షాంపూలు, ఇప్ప పువ్వు లడ్డూలు, పప్పు చక్కలు, పచ్చళ్లు, సబ్బులు, మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తారు. ఇలాంటివి ఐదు గ్రూపులు ఉన్నాయి.
ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలి..
జిల్లాతోపాటు రాష్ట్రంలో గిరిమార్ట్ లు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలి. ఇదే సమయంలో గిరిజన మహిళా సంఘాలు ఆహార ఉత్పత్తులు తయారు చేయడానికి వీలుగా వసతులు కల్పించాలి. వెదురు చేసిన ఉత్పత్తులే కాకుండా సంప్రదాయ, వస్తువులను కూడా అమ్మడం ద్వారా బిజినెస్ తోపాటు ఆదాయం పెరుగుతుంది. - ముర్ల రమేశ్, ఆదివాసీ సంఘం నాయకులు
