మానవ నాగరికత చరిత్రలో వేల ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న మహా జలప్రళయ కథనాల వెనుక ఏదైనా ఉమ్మడి చారిత్రక జ్ఞాపకం దాగి ఉందా? వేదాలలోని మనువు, బైబిల్‌లోని నోవా, ఖురాన్‌లోని నూహ్, మెసొపొటేమియాలోని ఉత్నపిష్టిమ్, గ్రీకు సంప్రదాయంలోని డ్యూకలియన్ వంటి మహా జలప్రళయ గాథలు ఒకే ప్రాచీన నాగరికతను సూచిస్తున్నాయా? ఈ అంతుచిక్కని ప్రశ్నలకు సింధు లోయ నాగరికత ఆధారంగా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించింది ఇట్స్ సిక్స్‌త్ వావ్ (ITS 6TH WOW) సంస్థ.
ప్రపంచ చరిత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ITS 6TH WOW సంస్థ, జై మత్స్యావతార క్యాంపెయిన్ సంయుక్త ఆధ్వర్యంలో... "ప్రపంచ మహా జలప్రళయ నాగరికత – మత్స్యావతార నాగరికత" అనే వినూత్న పరిశోధనా చట్రాన్ని ఆవిష్కరించారు. ఈ పరిశోధనను సంస్థ ప్రధాన కార్యదర్శి రవీంద్రజిత్ రూపొందించారు.
అయితే, ఇది చారిత్రకంగా నిరూపితమైన సిద్ధాంతం కాదని.. భవిష్యత్ శాస్త్రీయ పరిశోధనల కోసం రూపొందించిన ఒక "రీసెర్చ్ హైపోథెసిస్" లేదా పరిశోధనా ప్రతిపాదన మాత్రమేనని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రపంచంలోని విభిన్న నాగరికతల్లోని జలప్రళయ కథనాలు కేవలం పురాణాలు కావు.. అవి ఒకే మూల సాంస్కృతిక జ్ఞాపకానికి ప్రతిరూపాలు కావచ్చు అనేది ఈ పరిశోధన సారాంశం. దైవ హెచ్చరిక, జీవరాశుల సంరక్షణ, మహా నౌక నిర్మాణం, ప్రళయం నుంచి రక్షణ వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సంప్రదాయాల్లోనూ ఉమ్మడిగా కనిపించడం విశేషం.ఈ ప్రతిపాదిత జలప్రళయ నాగరికతను అధ్యయనం చేయడానికి ఎంపిక చేయబడిన రక్షకుడు, ఆర్క్ నగరం, సప్త ఋషులు, యజ్ఞం, కృతజ్ఞతా సంప్రదాయం వంటి ఏడు మూల స్తంభాలను ఈ పరిశోధన సూచించింది.
►ALSO READ | తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ..సీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్. శ్రీధర్
ఈ పరిశోధనలో అత్యంత ఆసక్తికరమైన అంశం... గుజరాత్‌లోని "ధోలవీరా". అత్యాధునిక నీటి నిర్వహణ వ్యవస్థలు, అద్భుత పట్టణ ప్రణాళిక ఉన్న ధోలవీరాను.. జలప్రళయ నాగరికతలో పరిపాలనా, జ్ఞాన పరిరక్షణ కేంద్రంగా మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఈ పరిశోధన పేర్కొంది. అదేవిధంగా, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన డాక్‌యార్డు కలిగిన "లోథల్" నౌకాశ్రయానికి.. మహా నౌకల నిర్మాణంతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణాన్ని కూడా ప్రస్తావించింది.ఇక సింధు లోయ నాగరికతలో తరచూ కనిపించే "చేప చిహ్నం" వెనుక మత్స్యావతార జ్ఞాపకాలు ఉండి ఉండవచ్చనే సరికొత్త దృక్కోణాన్ని ఈ ప్రజెంటేషన్ ఆవిష్కరించింది.
ఈ "మత్స్యావతార నాగరికత" భావనను అంతిమ చారిత్రక సత్యంగా కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, భూగర్భ శాస్త్రవేత్తలు, కృత్రిమ మేధస్సు పరిశోధకులు ఆధారాలతో పరిశీలించాలని ITS 6TH WOW సంస్థ శాస్త్రీయ ప్రపంచానికి పిలుపునిచ్చింది.
