
పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో షాయ్ హోప్, బౌలింగ్‌లో జేడెన్ సీల్స్ రాణించడంతో 202 రన్స్ భారీ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది కరేబియన్ జట్టు. ముఖ్యంగా జేడెన్ సీల్స్ సీల్స్ 6 వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. జేడెన్ సీల్స్ నిప్పులు చెరిగే బంతులకు బెంబెలెత్తిపోయారు పాక్ బ్యాటర్లు. జేడెన్ సీల్స్ చెలరేగడంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది కరేబియన్ టీమ్. తద్వారా 1991 తర్వాత పాక్‌పై వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్ ఆసాంతం అద్భుతంగా రాణించిన జేడెన్ సీల్స్ (10 వికెట్లు) మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. దీంతో ప్రపంచ క్రికెట్లో జేడెన్ సీల్స్ పేరు ఒక్కసారిగా మోరుమోగిపోతుంది. దీంతో క్రికెట్ ప్రియులు ఎవరీ పేస్ గుర్రం అని అతడి గురించి వెతకడం ప్రారంభించారు.
23 ఏళ్ల ట్రినిడాడియన్ బౌలర్ జేడన్ సీల్స్ 2021లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అరంగ్రేటం చేసి దాదాపు నాలుగేండ్లు అవుతోన్న జేడన్ సీల్స్ మాత్రం ఈ ఏడాదే వెలుగులోకి వచ్చాడు. ఈ ఏడాది ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగిపోయాడు. టీ20, వన్డే, టెస్ట్ ఏదైనా సరే.. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ వికెట్లు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ విండీస్ నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం 2025లో ఇప్పటి వరకు 8 వన్డేల్లో 18 వికెట్లు.. 21 టెస్ట్‌ల్లో 88 వికెట్లు తీశాడు.
Also Read : భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తండ్రి వెస్ పేస్ కన్నుమూత
బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు ఈ పేస్ గుర్రం. ఒక మ్యాచులో 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం5 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి బ్యాటర్లకు పీడకలాగా మారాడు. ఈ అసాధారణ రికార్డ్ గురించి చర్చ ముగియకముందే.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ ఇదే సంచలన ప్రదర్శన రిపీట్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ గల ఆసీస్‌పై 3 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి క్రికెట్ ప్రియులను ఔరా అనిపించాడు.
ఇదిలా ఉండగానే తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ జేడెన్ సీల్స్ బ్యాటర్లను గడగడలాడించాడు. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో 10 వికెట్లు తీసి సిరీస్ లీడింగ్ వికెట్ టేకార్ గా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో జేడన్ సీల్స్ బౌలింగ్ వేరే లెవల్. సీల్స్ చేతి నుంచి మిస్సైల్లా దూసుకొచ్చే బంతులకు పాక్ బ్యాటర్లు వద్ద సమాధానమే లేకుండా పోయింది. బంతి టచ్ చేయాలంటేనే వణికిపోయారు పాక్ బ్యాటర్లు.
ఈ మ్యాచులో 7.2 ఓవర్లు వేసిన సీల్స్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీసి పాకిస్తాన్‌ను కుప్పకూల్చాడు. 295 పరుగుల చేధనలో సీల్స్ దెబ్బకు 92 పరుగులకే చాపచుట్టేసింది పాక్. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత్‌లో పర్యటించనుంది విండీస్ జట్టు. దీంతో టీమిండియా ఫోకస్ అంతా జేడన్ సీల్స్‌పై పడింది. బ్యాటర్ల పాలిట సింహాస్వప్నంలా మారిన విండీస్ నయా సంచలనంతో టీమిండియాకు సవాల్ తప్పదు.
దీంతో అగ్రశేణి జట్లను గడగడలాడిస్తున్న సీల్స్.. భారత్‌కు కొరకరాని కొయ్యగా మారుతాడా..? లేక వరల్డ్ క్లాస్ టీమిండియా బ్యాటర్ల ముందు తేలిపోతాడా అనేది చూడాలి. ఇదే కాకుండా ప్రపంచ క్రికెట్లో సంచలనంగా మారిన జేడన్ సీల్స్.. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో కూడా కోట్లు పలికే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్షన్లో సీల్స్ హాట్ కేకులా అమ్ముడుపోవచ్చని.. అతడి కోసం ప్రాంచైజ్‌లు పోటీ పడొచ్చంటున్నారు.