
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, మాజీ హాకీ ప్లేయర్ వెస్ పేస్ (80) కన్ను మూశారు. గతకొంత కాలంగా వృద్ధాప్యసమస్యలు, పార్కిన్సన్స్ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే 2025, ఆగస్ట్ 12న వెస్ పేస్‌ను కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి గురువారం (ఆగస్ట్ 14) ఆయన తుదిశ్వాస విడిచారు. వెస్ పేస్ మృతి పట్ల పలువురు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1945లో గోవాలో జన్మించిన డాక్టర్ వెస్ పేస్ 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టులో సభ్యుడు. హాకీలో మిడ్‌ఫీల్డర్ అయిన వెస్ పేస్.. ఒత్తిడిలో వ్యూహాత్మకంగా, ప్రశాంతంగా వ్యవహరించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించేవారు. ఆయన 1971 హాకీ ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. క్రీడల్లో రాణిస్తూనే ఆయన మెడిసిన్ చదివారు.
హాకీకి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత తన జీవితాన్ని వైద్య రంగానికి అంకితం చేశారు. వైద్యుడిగా ఆయన చేసిన కృషి భారత అథ్లెట్లకు గాయాలు, పునరావాసం ద్వారా మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయ పోటీలలో వివిధ భారతీయ క్రీడా బృందాలకు వైద్యుడిగా పేస్ విశిష్ట సేవలందించారు. ఒలింపిక్ పతక విజేత, డాక్టర్‌గా కాకుండా భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తండ్రిగా కూడా వెస్ పేస్ గుర్తింపు పొందారు.