హైదరాబాద్, వెలుగు: సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ భవన్ లో హరీశ్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో అన్నీ దొంగ లెక్కలే ఉన్నాయని, ఆయన మాట్లాడిన మాటలు కూడా దొంగ మాటలే అని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. హరీశ్ రావు ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాతనే తెలంగాణ వాళ్లు మంచినీళ్లు తాగుతున్నట్లు చెప్పారని, ఇంతకన్నా పచ్చి అబద్ధం మరొకటి ఉండదన్నారు.
గాంధీ భవన్ లో ఆదివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగుతున్నట్లుగా హరీశ్ చెప్పిన మాటలు పూర్తి అవాస్తవం. బీఆర్ఎస్ భవన్ లో చెప్పిన విషయాలు నిజమే అయితే వీటినే అసెంబ్లీలో ఎందుకుచెప్పలేదు?’’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
