- సావంత్, మంత్రి అడ్లూరితో వేర్వేరుగా జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ భేటీ
- జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్
- ఆ ఇద్దరు నేతలకు హైకమాండ్ అల్టిమేటం
- ఆసక్తిగా మారిన జగిత్యాల మున్సిపల్ పాలిటిక్స్
- జెండా మోసినోళ్లకే న్యాయం జరగాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్నది. హంగ్ ఏర్పడిన జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అయితే.. చైర్మన్ పీఠం కోసం ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అటు ఎమ్మెల్యే సంజయ్ వర్గాల మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. ఈ పంచాయితీ ఆదివారం ప్రజాభవన్ కు చేరడంతో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు.
దీంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. పార్టీ అంతర్గత విషయాలను రోడ్డుపైకి తీసుకురావడంతో కేడర్‌లో అయోమయం నెలకొందని, ఆయన వారిని సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది. క్రమశిక్షణే ముఖ్యమని, పార్టీ తీసుకునే తుది నిర్ణయానికి ఇరువురు నేతలు కట్టుబడి ఉండాలని సావంత్ స్పష్టం చేశారు. ఐక్యత చాటాలని, పార్టీ బలోపేతం దృష్ట్యా ఇరువురు నేతలు కలిసి పనిచేయాలని సూచించారు.
16 బీఫారాలు ఇస్తే.. 9 మందిని గెలిపించుకున్నా
ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో జరిగిన భేటీలో జీవన్ రెడ్డి ఎన్నికల ఫలితాలపై పూర్తి డేటాను ముందుంచారు. ఎమ్మెల్యే సంజయ్ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘నాకు పార్టీ 16 బీఫామ్ లు ఇస్తే.. అందులో 9 మందిని కౌన్సిలర్లుగా గెలిపించుకున్నా. కానీ సంజయ్‌కి 34 బీఫారాలు ఇస్తే కేవలం 14 మందిని మాత్రమే గెలిపించుకున్నరు’ అని జీవన్ రెడ్డి హైకమాండ్ నియమించిన ప్రతినిధులకు వివరించారు.
పార్టీ టికెట్ ఇవ్వకుండా తనవర్గం వారిని ఎమ్మెల్యే సంజయ్ పక్కన పెట్టారని, అలా పక్కన పెట్టిన 9 మందిని తాను ఇండిపెండెంట్లుగా నిలబెట్టి గెలిపించుకున్నానని స్పష్టం చేశారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారికే పదవులు ఇవ్వాలని, తన వర్గానికి చెందిన వారికే చైర్మన్ పీఠం దక్కాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జీవన్‌రెడ్డికి మీనాక్షి నటరాజన్ ఫోన్
శనివారం మంత్రులతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి.. జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలను గెలిపించే బాధ్యతను మంత్రి అడ్లూరి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌కు అప్పగించారు. దీంతో ఈ ఇద్దరు నేతలు రంగంలోకి దిగారు. తొలుత జీవన్ రెడ్డి ప్రజా భవన్‌కు వచ్చి వారితో భేటీ అయ్యారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత ఎమ్మెల్యే సంజయ్ వచ్చి సమావేశమయ్యారు.
ఇద్దరు నేతల మధ్య సమన్వయం కుదిర్చి చైర్మన్ పీఠం దక్కించుకునేలా రాజీకుదిర్చినట్లు తెలిసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. భేటీ అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యమివ్వాలని కోరానని, తన ఆలోచనలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని హైకమాండ్‌కు చెప్పినట్లు తెలిపారు. తాను ఎప్పుడూ పార్టీ జెండా మోసిన వారికే పదవులు ఇవ్వాలని కోరుకుంటానని, అయితే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
జెండా మోసిన వారికే పట్టం!
ఈ భేటీలో అత్యంత కీలకమైన నిర్ణయం పదవుల కేటాయింపుపై జరిగింది. పార్టీ కోసం కష్టపడి, జెండా మోసిన నిజమైన కార్యకర్తలకు, పాత తరం నాయకులకే మున్సిపల్ చైర్మన్ వంటి కీలక పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. తొలి నుంచి జీవన్ రెడ్డి వాదిస్తున్నట్లుగా.. పార్టీని నమ్ముకుని ఉన్న వారికే ప్రాధాన్యమివ్వాలన్న సూచనను ఏఐసీసీ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.
సంజయ్ కుమార్ కూడా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సర్దుకుపోయేందుకు అంగీకరించినట్లు తెలుస్తున్నది. దీంతో జగిత్యాల కాంగ్రెస్‌లో నెలకొన్న అనిశ్చితి తొలిగిపోయింది. పదవుల పంపకంలో విధేయతకే పెద్దపీట వేయాలని నిర్ణయించడం ద్వారా పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపేందుకు హైకమాండ్ ప్రయత్నం చేస్తున్నది.
సీల్డ్ కవర్లో ఎవరి పేరుంది ?
కాంగ్రెస్ పెద్దల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీల్డ్ కవర్ లో చైర్ పర్సన్ అభ్యర్థి పేరును ఖరారు చేయగా.. ఈ నిర్ణయానికి ఇరువురు నేతలు కట్టుబడి ఉండాలని అల్టిమేటం జారీ చేసింది. అయితే, ప్రమాణ స్వీకారం సమయంలో ఇరువర్గాల్లో ఎవరికి పెద్దపీట వేస్తారు..? ఈ క్రమలో ఒక వర్గానికి అనుకూలం, మరోవర్గానికి ప్రతికూలంగా ఉన్న పేరు వస్తే ఇటు ఎమ్మెల్యే సంజయ్.. అటు మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి చెందిన కౌన్సిలర్లు మద్దతు ఇస్తారా..? ఇవ్వరా..? అనేది సస్పెన్షన్‌గా మారింది.
మరోవైపు.. చైర్ పర్సన్ ఎన్నిక సజావుగా జరుగుతుందా..? లేదా అనేది కూడా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు సీల్డ్ కవర్ లో ఎవరి పేరుంది..? ఈ ఇద్దరు నేతలు సూచించిన పేర్లు కాకుండా కొత్త అభ్యర్థి పేరుంటే పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది సోమవారం తేలిపోనుంది.
