- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాయికల్, వెలుగు: తమది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబమేనని, తాను అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే తప్పేంటని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్సంజయ్కుమార్ ప్రశ్నించారు. రాయికల్‌మండలం దావనపెల్లి, తాట్లవాయి గ్రామాల్లో రూ.20లక్షలతో నిర్మించతలపెట్టిన మహిళ సంఘ భవనాల నిర్మాణ పనులకు బుధవారం ఆయన భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో గ్రామాల్లో జరిగిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాలేదని మాజీ సర్పంచులు ఇబ్బందులు పడుతుంటే తానే ముందుండి కొన్ని గ్రామాల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేయించానని గుర్తుచేశారు. ఇదంతా తాను ప్రభుత్వంతో పనిచేయడం వల్లే జరుగుతోందని, అయినా అది తప్పన్నట్లు కొందరు వ్యవహరిస్తున్నారని వాపోయారు.
కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు మాలోత్ ప్రసాద్, ఆకుల మల్లేశం, ఉప సర్పంచులు బణావత్ రవి, మారుపాక నారాయణ, రాయికల్ మున్సిపల్ చైర్‌పర్సన్ కట్కం రవి, వైస్ చైర్‌పర్సన్ సౌజన్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రావు, లీడర్లు జాదవ్అశ్విని, సంధ్యారాణి, కోల శ్రీనివాస్, ఏనుగు మల్లారెడ్డి, తహసీల్దార్ నాగార్జున, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అల్లీపూర్గ్రామంలోని రాజారాజేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన రథోత్సవంలో పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలి
జగిత్యాల రూరల్, వెలుగు: గ్రామాల అభివృద్ధికి కొత్తగా ఎన్నికైన సర్పంచులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జగిత్యాల న్యాక్ కేంద్రంలో నియోజకవర్గ సర్పంచులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల్లో తడి పొడి చెత్తతో ఎరువుల తయారీకి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీపీవో మదన్ మోహన్, న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేశ్, ఎంపీడీవో చిరంజీవి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గంగారెడ్డి పాల్గొన్నారు.

