జగిత్యాలలో లావోస్ సైబర్ ఫ్రాడ్ గ్యాంగ్ అరెస్ట్

జగిత్యాలలో లావోస్ సైబర్ ఫ్రాడ్ గ్యాంగ్ అరెస్ట్

జగిత్యాల టౌన్, వెలుగు: విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను మభ్యపెట్టి లావోస్ దేశానికి తరలించి సైబర్ మోసాలకు పాల్పడిన నలుగురిని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు. శుక్రవారం జిల్లా పోలీస్ ఆఫీస్ లో మీడియాకు ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. మల్లాపూర్‌‌‌‌ మండలం ఓబుల్‌‌పూర్ తండాకు చెందిన ఇస్లావత్‌‌ విజయేందర్‌‌‌‌ 2024లో లావోస్ వెళ్లి సైబర్ ఫ్రాడ్‌‌ నెట్‌‌వర్క్‌‌లో చేరాడు.  

ఒక్కొక్కరిని లావోస్‌‌కు రప్పిస్తే 13,000 యువాన్లు (సుమారు ₹1.75 లక్షలు) కమీషన్ ఇస్తామని జగిత్యాల, పరిసర ప్రాంతాల యువతను రిక్రూట్ చేయడం ప్రారంభించాడు. ఇతనికి సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన మీసాల రాజశేఖర్, రంగపేటకు చెందిన దండుగుల కళ్యాణ్, ధర్మపురికి చెందిన శ్యామ్ రావు రాజశేఖర్ ముఠాగా ఏర్పడి సహకరించేవారు.

ఇలా జగిత్యాల పరిసరాల ప్రాంతాలకు చెందిన పలువురిని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.75వేల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేశారు. ఇలా వెళ్లినవారి పాస్​పోర్ట్‌‌లు గుంజుకొని సైబర్‌‌‌‌ ఫ్రాడ్‌‌లో పనిచేయించేవారు. ఈక్రమంలో జగిత్యాలకు చెందిన కేశావతుల అరవింద్‌‌ ఫిర్యాదు మేరకు 2025లో కేసు నమోదు చేసిన పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

ఈనెల 17న విజయేందర్‌‌‌‌ హైదరాబాద్ రాగా శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో అరెస్ట్‌‌ చేశారు. అతడిని విచారించిన పోలీసులు మిగతా ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు వైజాగ్‌‌కు చెందిన రాజు లావోస్‌‌లో ఉన్నాడు. కాగా నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌‌కు తరలించారు. ప్రెస్ మీట్‌‌లో సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ, రూరల్ ఇన్‌‌స్పెక్టర్ సుధాకర్, ఎస్‌‌ఐలు ఉమాసాగర్, దినేశ్‌‌, సిబ్బంది పాల్గొన్నారు