- జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల టౌన్, వెలుగు: కొండగట్టు హనుమాన్ చినజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరిగే ఉత్సవాలకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
వేసవి దృష్ట్యా తాగునీరు, చలివేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని, 7 ప్రాంతాల్లో పార్కింగ్ వసతితో పాటు సరిపడా లైటింగ్ ఉండాలని సూచించారు. అనంతరం జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 46 ఫిర్యాదులు స్వీకరించారు. బీర్పూర్ మండల కేంద్రంలో ఖాళీ స్థలానికి ఇంటి నంబర్ కేటాయించి, అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించిన పంచాయతీ కార్యదర్శి నరేశ్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు సత్యనారాయణ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్, ఆర్డీవో మధుసూదన్, ఈవో అంజనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు తక్షణ న్యాయం అందించాలి
జగిత్యాల టౌన్, వెలుగు: జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన ‘గ్రీవెన్స్ డే’లో భాగంగా ఎస్పీ అశోక్ కుమార్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
