- జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల టౌన్/మల్లాపూర్, వెలుగు: జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇప్పటివరకు 50శాతం కొనుగోళ్లు పూర్తయినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ లతతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 441 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, ఇందుకు సంబంధించి రూ.353.71 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అధికారుల సమన్వయంతో వారం రోజుల్లోనే లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు.
ఈ సీజన్‌లో మొత్తం 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, ఈ నెల ఆఖరు నాటికి 80 శాతం కొనుగోళ్లు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో సివిల్ సప్లై అధికారి జితేందర్ రెడ్డి, డీఎం జితేంద్ర ప్రసాద్, డీపీఆర్‌వో నరేశ్, తదితరులు పాల్గొన్నారు. మల్లాపూర్ మండలం ముత్యంపేట, చిట్టాపూర్, రాఘవపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత పరిశీలించారు. మిల్లులకు వచ్చిన ధాన్యం లారీలను వెంటనే అన్‌లోడ్ చేయాలని మిల్లర్లను అదేశించారు.
