మెడిసిన్స్ అక్రమంగా నిల్వ చేసిన డాక్టర్​కు జైలు శిక్ష

మెడిసిన్స్ అక్రమంగా నిల్వ చేసిన డాక్టర్​కు జైలు శిక్ష

ముషీరాబాద్, వెలుగు: ఎలాంటి అనుమతులు లేకుండా తన ఇంట్లో అక్రమంగా ఔషధాలు నిల్వచేసిన ఓ డాక్టర్ ను, అతడికి మెడిసిన్స్ ను సరఫరా చేసిన వ్యక్తికి  జైలుశిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. ముషీరాబాద్ ఇన్​చార్జ్​ డ్రగ్ ఇన్ స్పెక్టర్ గంట్ల అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 2015లో చిక్కడపల్లి పరిధి వివేక్ నగర్ లో ఉండే అర్థోపెడిక్ డాక్టర్ రామకృష్ణ తన ఇంట్లో అక్రమంగా మెడిసిన్స్​ నిల్వచేయగా.. అప్పటి ఔషద నియంత్రణ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో మెడిసిన్స్ నిల్వ చేసిన డాక్టర్ తోపాటు, అక్రమంగా మెడిసిన్స్ సరఫరా చేసిన రతన్ ను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. మంగళవారం వారిద్దరిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావు డాక్టర్ రామకృష్ణకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.4 లక్షల 95 వేల జరిమానా విధించారు. రతన్​కు మూడేళ్ల శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు తీర్పునిచ్చారు. కాగా ఈ విషయాన్ని డ్రగ్ ఇన్​స్పెక్టర్ గంట్ల అనిల్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. డాక్టర్లు అక్రమంగా మెడిసిన్స్​నిల్వ చేయడం, అమ్మడం నేరమని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.