24న తెలంగాణలోకి కాంగ్రెస్ యాత్ర

24న తెలంగాణలోకి కాంగ్రెస్ యాత్ర

హైదరాబాద్, వెలుగు: దేశంలో బీజేపీ పాలన కారణంగా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, తరతరాలుగా వస్తున్న సంప్రదాయ జీవన విధానం ధ్వంసం అవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 24న తెలంగాణలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ బోయిన్​పల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్​లో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. యాత్ర జాతీయ స్థాయి సమన్వయ బాధ్యతలు చూస్తున్న దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్​, రాష్ట్ర స్థాయి పర్యవేక్షకులు ఉత్తమ్​కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సుబ్బరామిరెడ్డి, కొప్పుల రాజు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో జైరాం మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర ప్రధాని మోడీ స్పీచ్ లు ఇచ్చే మన్ కీ బాత్​వంటి కార్యక్రమం కాదన్నారు. ఇది ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునే ‘జనతాకీ చింతా’ యాత్ర అని అన్నారు. 

లోకల్ పార్టీలు మార్పు తేలేవు..   
దేశంలో అందరికీ సమానంగా బతికే హక్కు ఉందని, బీజేపీ పాలన పుణ్యమా అని అది ఇపుడు ప్రమాదంలో పడిందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. పేదలు మరింత నిరుపేదలుగా మారారని, నిరుద్యోగం పెరిగిపోతోందని అన్నారు. దేశంలో లోకల్ పార్టీలు ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాలేవన్నారు. పేరు మార్చినంత మత్రాన ఏమీ జరగదని బీఆర్ఎస్ ను ఉద్దేశించి అన్నారు. 

నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు డుమ్మా
న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్ హెరాల్డ్ కేసును ఈడీ వేగవంతం చేసింది. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు యంగ్ ఇండియా కంపెనీకి ఇచ్చిన విరాళాలపై విచారణకు రావాలని గీతారెడ్డి, షబ్బీర్ అలీ, గాలి అనిల్, అంజన్ కూమార్, సుదర్శన్ రెడ్డికి ఈడీ లేఖ రాసింది. సోమవారం ఈడీ విచారణకు షబ్బీర్ అలీ హజరయ్యారు. దాదాపు ఆరు గంటల పాటు అధికారులు ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం. మంగళవారం గీతారెడ్డి, గాలి అనిల్ హాజరు కావాలని ఈడీ అధికారులు చెప్పినా.. కొన్ని కారణాల వల్ల వాళ్లు హాజరు కాలేదు. గురువారం హాజరవుతామని అధికారులకు వారు చెప్పినట్లు సమాచారం.