ఏపీలో టీడీపీ ఆఫీసులను ముట్టడిస్తం : జాజుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌

ఏపీలో టీడీపీ ఆఫీసులను ముట్టడిస్తం : జాజుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌
  • మేనిఫెస్టోలో ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌

సైఫాబాద్, వెలుగు: ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీలకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి వెన్నెముకగా నిలిచిన బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీయడం దుర్మార్గమని ఆరోపించారు.

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిసిన సీఎం చంద్రబాబు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కనీసం ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. రిజర్వేషన్లు తగ్గించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌లు బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గంలోని బీసీ మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సవాల్ విసిరారు.

తక్షణమే ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తెలుగు రాష్ట్రాల్లో బీసీలను ఏకం చేసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని, ఏపీలో టీడీపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.