ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ ఉచ్చులో పడొద్దు : జాజుల శ్రీనివాస్ గౌడ్ 

ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ ఉచ్చులో పడొద్దు : జాజుల శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్/పంజాగుట్ట, వెలుగు: ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ పేరుతో బహుజన వర్గాలను మళ్లీ విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్​పై ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ ఉపసంహరించుకోవాలని కోరారు.

తెలంగాణ ఉద్యమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజన వర్గాలే కీలక పాత్ర పోషించాయని, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అయినా బీసీలకు రాజకీయంగా, సామాజికంగా సరైన ప్రాధాన్యం దక్కలేదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల సంఖ్య తగ్గడంతో పాటు కీలక పదవులు కూడా బీసీలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ ఉద్యమాన్ని బలహీనపర్చేందుకే మళ్లీ తెలంగాణ-ఆంధ్ర అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. ఈ సెంటిమెంట్ ఉచ్చులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పడొద్దని సూచించారు.

తెలంగాణ కోసం పోరాడిన బహుజనులకు అధికారంలో వాటా దక్కాల్సిందిపోయి, కొద్దిమంది అగ్రవర్ణాలే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారని విమర్శించారు. బీసీ సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్, కార్పొరేషన్ రుణాలు, కులవృత్తులకు నిధుల విషయంలో కూడా అన్యాయం జరుగుతోందన్నారు. బీసీ మహనీయుల పేర్లను జిల్లాలు, ప్రాజెక్టులు, పార్కులకు పెట్టడంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలే ముఖ్యమంత్రులు కావాలన్నదే తమ లక్ష్యమని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలన్నీ ఐక్యంగా ముందుకు రావాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.