డజను పెళ్లిళ్లు చేసుకుని డబ్బు, నగలతో జంప్.. ఆ తర్వాతేమైందంటే..

డజను పెళ్లిళ్లు చేసుకుని డబ్బు, నగలతో జంప్.. ఆ తర్వాతేమైందంటే..

జమ్మూ- కాశ్మీర్‌లో డజనుకు పైగా పురుషులను పెళ్లి చేసుకుని, మోసం చేసిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి డబ్బు, బంగారం తీసుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పట్టుబడినట్టు సమాచారం.

రాజౌరిలోని నౌషెరా పట్టణంలో గత వారం షాహీన్ అక్తర్ (30)ని పోలీసులు అరెస్టు చేశారు. షహీన్ పెళ్లి తర్వాత తనను మోసగించిందని ఆరోపిస్తూ... మహ్మద్ అల్తాఫ్ మార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. షహీన్‌పై ఇలాంటి ఆరోపణలతో పలువురు వ్యక్తులు కూడా ముందుకు రావడంతో అసవు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే బాధితుల పూర్తి జాబితాను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

బుద్గాంకు చెందిన బాధితుల్లో ఒకరైన మహ్మద్ అల్తాఫ్ మీర్, వధువు తనకు మధ్యవర్తి ద్వారా పరిచయం అయ్యిందని చెప్పారు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకుని, నాలుగు నెలలు కలిసి జీవించారు. అనంతరం ఆమె నగదు, బంగారంతో అదృశ్యమైనట్టు తెలుస్తోంది. మీర్ ఫిర్యాదు ఆధారంగా సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్‌లో షాహీన్‌పై సెక్షన్ 420, 120బి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

జూలై 14న ఆమెను అరెస్టు చేశారు. అదే రోజు, షాహీన్ ముందస్తు బెయిల్‌ను కోరుతున్నట్లు ఆరోపణలు రావడంతో బుద్గామ్ కోర్టు కాంప్లెక్స్ వద్ద కొంతమంది వ్యక్తులు ఆందోళన చేశారు. ఆమె తమను పెళ్లిచేసుకుందని, ఆ తర్వాత సడెన్ ఆమె తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయిందని ఆరోపించారు.