శ్రీ కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి.. 6న లేక 7వ తేదీనా..

శ్రీ కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి.. 6న లేక 7వ తేదీనా..

2023 వ  సంవత్సరంలో  అధికమాసం రావడంతో  పండగలు, పర్వదినాల విషయంలో కొంత అస్పష్టత ఏర్పడింది. పండగ ఘడియలు ఎప్పుడు ప్రవేశిస్తాయనేది కొంత గందరగోళం నెలకొంది. తిథులు, పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే ఒక్కో పండుగ, శుభ ఘడియలు రెండు రోజుల పాటు ఉంటున్నాయి.

కృష్ణాష్టమి పండగ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 6వ తేదీనా? లేక 7వ తేదీన జరుపుకోవాలా? అనేది తేలట్లేదు. కృష్ణ జన్మాష్టమి భాద్రపద మాసం కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున కృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి.  దృక్ పంచాంగ్ ప్రకారం- జన్మాష్టమి రోజున రోహిణి నక్షత్రం, అష్టమి తిథి గడియలు రాత్రి సమయంలో వస్తాయి. అందువల్ల ఈ సంవత్సరం జన్మాష్టమి రెండు రోజుల పాటు జరుపుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 3:37 నిమిషాలకు అష్టమి తిథి ప్రారంభమౌతుంది. 7వ తేదీన సాయంత్రం 4:14 గంటలకు ముగుస్తుంది.

రోహిణీ నక్షత్రం సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 9:20 నిమిషాలకు ప్రారంభమై, 7వ తేదీ ఉదయం 10:25 నిమిషాలకు ముగుస్తుంది. దీన్ని బట్టి చూస్తే 6వ తేదీన జన్మాష్టమి కాగా, 7వ తేదీన ఉట్టి కొట్టే వేడుకలను నిర్వహించాల్సి ఉంటుంది. జన్మాష్టమి నాడు పూజకు అనుకూలమైన సమయం రాత్రి 11:57 గంటలకు ప్రారంభమౌతుంది.

  • అష్టమి తిథి:  సెప్టెంబర్ 6  మధ్యాహ్నం 3:37 గంటలకు  ప్రారంభం
  • రోహిణి నక్షత్రం: సెప్టెంబర్ 6 ఉదయం 9:20 గంటలకు ప్రారంభం 
  • రోహిణి నక్షత్రం:  సెప్టెంబర్ 7 ఉదయం 10:25 వరకు  
  • జన్మాష్టమికి శుభ ముహూర్తం:  సెప్టెంబర్ 7 రాత్రి 11:57 గంటల నుంచి  రాత్రి 12.42 గంటల వరకు.  
  • ఉట్టి కొట్టే  సమయం: సెప్టెంబర్ 7 సాయంత్రం 4:14 గంటలకు ఉంటుంది. 

ఈ ఏడాది కృష్ణాష్టమి పండుగను సెప్టెంబర్ 6, 7 తేదీలు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

శ్రీకృష్ణాష్టమి అనగా కృష్ణుడు పుట్టిన రోజు.   ఈ రోజున తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకొని ... స్నానం చేసేటప్పుడు నీటిలో తులసి ఆకులు.. గంధం పొడి, పసుపు వంటివి వేసుకొని అభ్యంగ స్నానం చేయాలి.  తరువాత శ్రీకృష్ణుని పూజించి ఉపవాసంఉండాలి.  సూర్యాస్తమయం.. ప్రదోషకాలంలో దేవాలయాలకు వెళ్లి.. కృష్ణుని పూజిస్తూ.. భజన సంకీర్తనలు చేయాలి.  ఆ తరువాత శ్రీకృష్ణుని లీలలను స్మరించుకోవాలి .  ఆ తరువాత దహీదండీ ( పెరుగు, వెన్న నింపిన మట్టి కుండలను పగులకొట్టడం) వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేయాలి. ఆ తరువాత శ్రీకృష్ణుడిని షోడశోపచారాలతో పూజించి .. లడ్డూ, పెరుగు, వెన్న వంటివి నివేదించాలి.  సర్వే జనో సుఖినో భవంతు....