జపాన్ ప్రభుత్వం 2026 సీజన్ లో భారతదేశం నుంచి తాజా మామిడి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఫ్యూమిగేషన్,పండ్ల నిల్వలో కొన్ని లోపాలు గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ అధికారులు వెల్లడించారు. మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని రెహమాన్‌పూర్ VHT (వేపర్ హీట్ ట్రీట్‌మెంట్) కేంద్రాన్ని తనిఖీ చేసిన జపాన్ క్వారంటైన్ ఇన్‌స్పెక్టర్లు కొన్ని టెక్నికల్ లోపాలను గుర్తించారు. దీంతో అల్ఫోన్సో, కేసర్, లంగ్రా, బంగనపల్లి వంటి ప్రధాన భారతీయ మామిడి రకాల ఎగుమతులను నిలిపివేశారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మామిడి ఎగుమతులు అధికంగా ఉంటాయి. ఈ సీజన్ లోనే మామిడి పండ్లను నిషేధించడంతో ఎగుమతిదారులకు తీరని నష్టం వాటిల్లుతోంది.
1986లో ఈగల భయంతో జపాన్ భారత మామిడి దిగుమతులను నిషేధించింది. 2006లో ప్రత్యేక ఒప్పందంతో మళ్లీ ఎగుమతులను ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి సీజన్‌లో జపాన్ అధికారులు భారతీయ VHT కేంద్రాలను తనిఖీ చేస్తూ వచ్చారు. జపాన్ ..భారత మామిడికి ప్రధాన మార్కెట్ కాకపోయినా, అక్కడి మార్కెట్లో అధిక ధరలు లభించడం వల్ల ఎగుమతిదారులకు ఇది కీలకమైనది. ఇప్పటికే వడగాలుల కారణంగా అల్ఫోన్సో దిగుబడులు తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మామిడి వ్యాపారానికి ఈ నిర్ణయం మరో పెద్ద సవాలుగా మారింది.
