- 8 ప్రాంతాలను వరల్డ్ క్లాస్‌గా మార్చేందుకు మాస్టర్ ప్లాన్
- స్కైవాక్‌లు, వ్యూ డెక్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు ప్రణాళికలు
- సోమశిలలో క్రూయిజ్ పర్యటనలు, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలి దశలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను (మొత్తం 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలు) ఆకర్షణీయమైన గమ్యస్థానాలుగా తీర్చిదిద్దేందుకు ‘సమగ్ర మాస్టర్ ప్లాన్ల్’ రూపకల్పనపై దృష్టిసారించినట్టు ఆయన తెలిపారు.
సోమవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, ఆర్కిటెక్చరల్ ఇంజినీర్లు, కన్సల్టెంట్లతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. పర్యాటకులు మన రాష్ట్రానికి వస్తే వారికి మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోవాలని, ప్రకృతి, వారసత్వం, ఆధ్యాత్మికత, సాహస క్రీడల కలబోతతో కూడిన ‘స్లో టూరిజం’ను ప్రోత్సహించాలన్నారు.
పర్యాటకులు ఒక ప్రాంతాన్ని సందర్శించి వెళ్లిపోయేలా కాకుండా, అక్కడి ప్రకృతి, చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత, స్థానిక జీవనశైలిని ఆస్వాదిస్తూ మధురానుభూతిని పొందేలా సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని సూచించారు. మొదటి దశలో భాగంగా వికారాబాద్, సోమశిల–అలంపూర్, వరంగల్–రామప్ప, నాగార్జునసాగర్, యాదాద్రి–పోచంపల్లి, ఆదిలాబాద్ గిరిజన క్లస్టర్, భద్రాచలం, కాళేశ్వరం ప్రత్యేక పర్యాటక ప్రాంతాలకు ఒకే తరహా ప్రతిపాదనలు కాకుండా, ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, భౌగోళిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యం, పర్యాటక అవకాశాలను అధ్యయనం చేసి ప్రత్యేక మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని స్పష్టం చేశారు.
తెలంగాణలోనూ ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు, క్యాంటిలీవర్ వ్యూ డెక్స్, స్కైవాక్‌లు, అడ్వెంచర్ యాక్టివిటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రకృతి ఆధారిత అనుభూతులను కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
భువనగిరి కోట అభివృద్ధికి అపార అవకాశాలు
భువనగిరి కోట అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, కేరళలోని జటాయు ప్రాజెక్టు కంటే భువనగిరి కొండ ప్రాంతం మరింత విస్తీర్ణం కలిగి ఉందని మంత్రి జూపల్లి తెలిపారు. చారిత్రక వారసత్వాన్ని పరిరక్షిస్తూ దేశంలోనే అత్యుత్తమ హెరిటేజ్, అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా భువనగిరిని అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. సోమశిల–అలంపూర్ సర్క్యూట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు.
సోమశిల కృష్ణా బ్యాక్ వాటర్స్ ప్రాంతంలో క్రూయిజ్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్ మార్గాలు, ఎత్తైన వ్యూ పాయింట్లు, ఎకో టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్‌ల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, టూరిజం ఎండీ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్ పాల్గొన్నారు.
