బాధితులకు సౌకర్యాలు కల్పించాలి : జాటోత్ హుస్సేన్ నాయక్

బాధితులకు సౌకర్యాలు కల్పించాలి : జాటోత్ హుస్సేన్ నాయక్

ఖమ్మం టౌన్, వెలుగు: భూదాన్ భూమిలో పక్క ఇండ్లు కోల్పోయి పునరావాస కేంద్రాల్లో ఉంటున్న నిర్వాసితులకు తక్షణమే భోజనం, తాగునీరు, మౌలిక సౌకర్యాలు వెంటనే కల్పించాలని అధికారులను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదేశించారు. ఆదివారం ఖమ్మం అర్బన్ మండలం భూదాన్ భూమిలో ఇండ్లు కోల్పోయిన బాధితులను సిటీలోని అంబేద్కర్ భవనం, టీటీడీసీ బిల్డింగ్ లో ఉన్న వారిని పరామర్శించారు. బాధితులతో మాట్లాడి ఇండ్లు కోల్పోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి బాధలు విన్న ఆయన కన్నీరు పెట్టుకున్నారు.

అనంతరం హుస్సేన్ నాయక్ అధికారుల సమన్వయ లోపాన్ని, నిర్లక్ష్యాన్ని తీవ్రస్థాయిలో ఎండగట్టారు. బాధితులు చెబుతున్న సమస్యలకు, అధికారులు ఇస్తున్న సమాధానాలకు మధ్య ఎలాంటి పొంతన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారికి మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు