4 గంటలు.. 100 మంది జవాన్లు.. భుజాలపై గర్భిణీ

4 గంటలు.. 100 మంది జవాన్లు.. భుజాలపై గర్భిణీ

సరిహద్దుల్లో శత్రువుల నుంచి దేశాన్ని కాపాడడమే కాదు, జనానికి ఆపదొచ్చినా ముందుంటారు సైనికులు. అందుకు ఈ ఫొటోనే నిదర్శనం. షమీమా అనే గర్భిణీకి నెలలు నిండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. కానీ, మంచు బాగా కురవడంతో బండ్లు వెళ్లేందుకు తొవ్వ కూడా సరిగా లేదు. దీంతో చినార్​ కార్ప్స్​కు చెందిన వంద మంది జవాన్లు ఆమెను స్ట్రెచర్​మీద ఆస్పత్రికి మోసుకెళ్లారు. ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు గంటల పాటు నడుచుకుంటూ ఆమెని హాస్పిటల్​కు తీసుకెళ్లారు. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఆ వీడియోను చినార్​ కార్ప్స్​ ట్విట్టర్​లో షేర్​ చేసింది. ఆర్మీ డే నాడే (జనవరి 15) ఇది జరిగింది. ఇక, ఆ వీడియోను ప్రధాని నరేంద్ర మోడీ రీట్వీట్​ చేశారు. ‘‘ధైర్యసాహసాలకు మన ఆర్మీ ప్రతీక. అంతేకాదు, మానవత్వపు స్ఫూర్తిని చాటుతుంది. ఆపద అని అంటే చాలు, అన్ని వేళలా అందుబాటులో ఉండి తన వంతు సాయం చేస్తుంది. ఆర్మీ మనందరికీ గర్వ కారణం. షమీమా, ఆమె బిడ్డకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అంటూ ఆయన ట్వీట్​ చేశారు.