- నేడు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ను నియమించే అవకాశం ఉంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఐదేళ్లు అధికారంలో ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ లతో పాటు కౌన్సిల్ సభ్యులుగా వ్యవహారించిన కార్పొరేటర్ల పదవి కాలం మంగళవారంతో ముగిసింది. దీంతో స్పెషల్ ఆఫీసర్ పాలన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికలు జరిగి మళ్లీ మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నకునేంత వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగనుంది.
నేడు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుపై జీవో!
జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగిసిన నేపథ్యంలో బుధవారం గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజ్ గిరి కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించిన జీవో విడుదల కానున్నది. అలాగే, కొత్త కార్పొరేషన్లకు ఇద్దరు కమిషనర్లతో పాటు ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించే చాన్స్ ఉంది. అయితే, ఇదివరకు అనుకున్న విధంగా కాకుండా ఇందులో కొన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లతో జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో మల్కాజ్ గిరి కార్పొరేషన్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో సైబరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటవుతాయన్న చర్చ జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో వస్తాయనుకున్న రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లలోని కొన్ని ప్రాంతాలను సైబరాబాద్ కార్పొరేషన్లోకి మారుస్తారని తెలుస్తున్నది.
