చదువుకోవాలని ఉంది.. సాయం చేయండి: కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితిలో జేఈఈ ర్యాంకర్

చదువుకోవాలని ఉంది.. సాయం చేయండి: కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితిలో జేఈఈ ర్యాంకర్

మహాముత్తారం, వెలుగు: ‘చిన్నగున్నపుడే తండ్రి చనిపోయాడు. కూలీ నాలీ చేసి తల్లి స్కూల్​కు పంపింది. ఇంటర్ పూర్తి చేసి జేఈఈ అడ్వాన్స్ లో మంచి ర్యాంకు సాధించినప్పటికీ జాయిన్ అయ్యేందుకు ఫీజులు కట్టే పరిస్థితి లేదు. ఎవరైనా దాతలు ఆదుకోవాలి’ అంటూ జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దొబ్బలపహాడ్​కు చెందిన రామ్ నాయక్ వేడుకుంటున్నాడు. భరోత్​ సమ్మయ్య, -ప్రమీల దంపతులకు ఇద్దరు కవలలు రామ్​నాయక్​.. లక్ష్మణ్​నాయక్. తండ్రి యాక్సిడెంట్​లో గాయపడి 2015లో మృతి చెందాడు. కూలీ డబ్బులతో తల్లి ప్రమీల ఇద్దరు కొడుకులను చదివించింది. కరీంనగర్​ జిల్లాలోని ట్రెబల్​ వెల్ఫేర్​ కాలేజీలో ఇంటర్ పూర్తిచేశారు. ఈ ఇద్దరు గతేడాదిలో జరిగిన జేఈఈ అడ్వాన్స్ లో ఎస్టీ కేటగిరిలో రామ్​నాయక్​ 710, ​లక్ష్మణ్​ నాయక్​1673వ ర్యాంకు సాధించారు.

రామ్​నాయక్​కు కాన్పూర్​ ఏరోస్పేస్​ ఐఐటీ ఇంజనీరింగ్​ సీటు కన్ఫాం అయింది. అందులో జాయిన్​ కావాలంటే రూ. లక్ష, నాలుగేళ్లలో 4 లక్షల వరకు అవసరం ఉంటుందని మేనేజ్​మెంట్ చెప్పడంతో తల్లి ప్రమీల సీటు రిజర్వేషన్​ కోసం కూలిపని చేసి కూడబెట్టిన రూ. 15వేలను చెల్లించింది. దీంతో రామ్​నాయక్​ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా దాతలు సాయం చేస్తే చదువుకుని మంచి పేరు తెస్తానని వేడుకుంటున్నాడు.