- మాజీమంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాల టౌన్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని, కేసీఆర్‌ను దోషిగా చూపడమే లక్ష్యంగా మేడిగడ్డ రిపేర్లను గాలికి వదిలేశారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు. జడ్పీ మాజీ చైర్‌పర్సన్ వసంతతో కలిసి గురువారం జగిత్యాల పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ వద్ద కుంగిపోయిన రెండు పిల్లర్లకు వెంటనే రిపేర్లు చేయాల్సింది పోయి.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్‌ను ఏడాదిగా పక్కన పెట్టిందని మండిపడ్డారు. సాయిల్ టెస్ట్‌లు కూడా చేయకుండా కాలయాపన చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.
తుమ్మడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువుఛాయలు కనిపిస్తున్నా.. సీఎంకు ‘ఫోర్త్ సిటీ’ పైనే ధ్యాస తప్ప రైతుల గోస పట్టడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు వరప్రదాయిని అని, ఇప్పటికైనా కుట్రలు మాని మేడిగడ్డ రిపేర్లైప దృష్టి పెట్టాలని సూచించారు.
