జగిత్యాల టౌన్, వెలుగు: బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఇందిరా భవన్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా వచ్చే నెల ఒకటి నుంచి ప్రారంభమయ్యే జాతీయ జనగణనలో కుల గణనను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. కులాల వారీగా జనాభా లెక్కలు నమోదు చేయడం ద్వారా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని తెలిపారు. బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానం చేసినప్పటికీ, 50 శాతం పరిమితి కారణంగా అమలు కాలేదని తెలిపారు. జనగణనతో పాటు కుల గణన చేపడితే బీసీల స్థితిగతులు స్పష్టమవుతాయని, విద్య, ఉద్యోగ, రాజకీయరంగాల్లో చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. ఈ అంశంపై సీఎంకు లేఖ రాసినట్లు తెలిపారు. కాంగ్రెస్ లీడర్లు బండ స్వామి, రాజేందర్, దుర్గయ్య, అశోక్ పాల్గొన్నారు.
