- మాజీ మంత్రి జీవన్రెడ్డి
రాజన్న సిరిసిల్ల, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డపై కుట్రలు మానుకొని వెంటనే బ్యారేజీని రిపేరు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ మరమ్మతులకు కేవలం రూ.400 కోట్లు అవసరమవుతాయని, ఈ మొత్తాన్ని కూడా కేటాయించడం భారంగా భావిస్తే ఎల్ అండ్ టీ సంస్థతోనే పనులు చేయించాలని సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యాక మూడేళ్ల వరకు కాంట్రాక్టరే మరమ్మతులు చేపట్టేలా నిబంధనలు ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అపోహలు సృష్టిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు తోసిపుచ్చడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని అన్నారు.
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మిస్తే భవిష్యత్‌లో నీటి హక్కులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని చెప్పి 30 నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో తన ముద్ర చూపించారని, కేటీఆర్ సిరిసిల్లను రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దారని అన్నారు. ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే పాలకులు సక్రమంగా పనిచేస్తారని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కొండూరి రవీందర్ రావు, న్యాలకొండ అరుణ, జిందం చక్రపాణి, గుడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

