- వలసవాదుల కింద పనిచేయడం మా వల్ల కాదు: జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, వెలుగు: మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి వలసవాదులకు ఇవ్వడం బాధాకరమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం వ్యక్తం. సోమవారం జగిత్యాలలోని ఇందిరా భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు సంబురపడాలో.. బాధపడాలో అర్థం కావడం లేదని బాధపడ్డారు.
బీఆర్ఎస్ నాయకులైన వలసవాదులకు పదవులు ఇవ్వడం, మొదటి నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను అణచివేయడం తప్పుగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన సమీండ్ల శ్రీనివాస్.. జనవరి 25న ఎమ్మెల్యేను కలిసి, కాంగ్రెస్‌లో చేరకుండా ‘‘అభివృద్ధికి సహాయపడతాను’’ అని చెప్పుకుని పదవి పొందారని విమర్శించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వైస్ చైర్మన్ గురించి తనతో మాట్లాడడం బాధాకరమని అన్నారు.
బీఆర్ఎస్ లో అవకాశాలు లేక వలసలు వచ్చి, మొదటి నుంచి కాంగ్రెస్‌ను నమ్ముకుని గెలిచిన కౌన్సిలర్లను అవమానిస్తున్నారని అన్నారు. ‘‘వలసవాదులకు పదవులు ఇచ్చి.. వారి కింద పని చేయమంటే మా మనోభావాలు ఏమవుతాయి? ఈ అవమానాలు ఎంతకాలం భరించాలి. ఈ పదవుల పంపిణీతో నా మానసిక క్షోభ పెరిగిందని. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో కొనసాగాలా? అని ఆలోచిస్తున్నాను. మాకు ఈ వేధింపులు ఎమ్మెల్యే ఉన్నంత కాలం కొనసాగుతాయి”అని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
