మెట్టు దిగని జీవన్ రెడ్డి!... ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని ప్రకటన

మెట్టు దిగని జీవన్ రెడ్డి!... ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని ప్రకటన
  • పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్,  విప్ ఆది శ్రీనివాస్ బుజ్జగింపులు
  •     పార్టీలో జరిగిన అవమానం చాలు.. కండువా కప్పుకోనన్న జీవన్​ 

జగిత్యాల, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మంగళవారం జగిత్యాలలోని ఆయన ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్  రాజీనామా నిర్ణయం నుంచి వెనక్కి తీసుకోవాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆయనకు పార్టీ కండువా కప్పేందుకు లీడర్లు సిద్ధపడగా, జీవన్ రెడ్డి నిరాకరించారని సమాచారం. ‘పార్టీలో నాకు జరిగిన అవమానం చాలు.. ఇక కాంగ్రెస్ కండువా కప్పుకోను’ అంటూ జీవన్​రెడ్డి తేల్చిచెప్పినట్లు తెలుస్తుంది. 

ఇదివరకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా ఆయనను కలిసి బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. పీసీసీ చీఫ్ వచ్చినా జీవన్ రెడ్డి పంతం వీడలేదు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసి అభిమానులతో  జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సమావేశం అనంతరం జీవన్ రెడ్డి ఇంటిపై ఇందిరా భవన్ పేరుతో ఉన్న బోర్డును కార్యకర్తలు తొలగించారు.    

మరోసారి ఆలోచించండి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

జీవన్ రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, రాష్ట్రంలోని కొద్దిమంది సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు అని మహేశ్ గౌడ్ అన్నారు.  వ్యక్తిగతంగా ఆయన తనకు తండ్రిలాంటి వారన్నారు. 2023 ఎన్నికల తరువాత మారిన రాజకీయ సమీకరణాల వల్ల ఆయన బాధపడ్డారని, కార్యకర్తల ఒత్తిడి, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఆయన పార్టీలోనే కొనసాగాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఏఐసీసీ సెక్రటరీ వంశీచందర్ రెడ్డి కూడా జగిత్యాలలో జీవన్ రెడ్డిని కలిసి రాజీనామా చేయొద్దని కోరారు. నాయకత్వానికి ఆయనపై విశ్వాసం ఉందని, పార్టీలోనే కొనసాగాలని సూచించారు.

గౌరవం లేని చోట ఉండలేను: జీవన్ రెడ్డి

పీసీసీ చీఫ్ వెళ్లిన అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ‘పరిష్కారం వాళ్ల దగ్గర లేదు.. నా దగ్గర కూడా లేదు’ అని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా సంపాదించిన గౌరవం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు తనకు కుటుంబ సభ్యుల్లాంటివారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో స్వపక్షంతో పోరాడాల్సి వచ్చిన పరిస్థితులే ఈ నిర్ణయానికి కారణమని తెలిపారు. 

తన గౌరవం సహచరుల గౌరవంతో ముడిపడి ఉందని, అందుకే రాజీనామా తప్పలేదన్నారు. ప్రజా జీవితంలో గౌరవం లేనప్పుడు కొనసాగడం సాధ్యం కాదని చెప్పారు. ఈనెల 25న కాంగ్రెస్​కు రాజీనామా చేస్తున్నానని, త్వరలో నియోజకవర్గంలో పర్యటించి తన అభిప్రాయాన్ని ప్రజలకు వివరిస్తానని తెలిపారు.