పార్టీ మార్పుపై ఉగాది తర్వాత నిర్ణయం : జీవన్ రెడ్డి

పార్టీ మార్పుపై ఉగాది తర్వాత నిర్ణయం : జీవన్ రెడ్డి
  •     పార్టీలోకి ఉడుములా వచ్చిన వారితో కలిసి పని చేసేదెలా?: జీవన్ రెడ్డి 

జగిత్యాల, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌ పార్టీని వీడాలని తాను అనుకోవడంలేదని, కానీ కొందరి వ్యవహార శైలి తనను ఆలోచించేలా చేస్తోందని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. తన భవిష్యత్ గురించి ఉగాది తర్వాత ప్రకటిస్తానని నిర్ణయాన్ని చెప్పారు. మంగళవారం ఇందిరా భవన్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గౌరవం లేనప్పుడు అభిమానాన్ని చంపుకుని పార్టీలో ఎలా కొనసాగుతానని ప్రశ్నించారు. ఒక వేళ నేను పార్టీ మారాల్సివస్తే అందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, హైకమాండ్ కారణం అవుతారన్నారు. 

అసలు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో తేల్చుకుని మాట్లాడాలని, ఆయన బీఆర్ఎస్‌‌‌‌ కు చెందినవాడని స్పీకర్ ప్రకటించారని, అలాంటి వ్యక్తి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌‌‌‌తో ఉన్న అనుబంధాన్ని ఎవరూ వదులుకోవాలనుకోరని, కానీ ‘‘పార్టీలో ఉడుములా సొచ్చిండు.. ఉడుముతో ఎవరైనా కలిసి ఉంటారా’’ అంటూ సంజయ్​పై విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్​ జోక్యం వల్ల అసలైన కార్యకర్తలకు న్యాయం జరగలేదని ఆరోపించారు. 

నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తే తప్పులేదని, కానీ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే అంగీకరించలేమన్నారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీలోనే కొనసాగాలని ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్​ బలంగా ఉండాలంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలను దూరంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో కొన్నింటినే అమలు చేసిందని, ఇంకా చేయాల్సినవి చాలానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.