కమీషన్ల కోసమే కాళేశ్వరం: జీవన్‌రెడ్డి

కమీషన్ల కోసమే కాళేశ్వరం: జీవన్‌రెడ్డి

కమీషన్లకు కక్కుర్తి పడి కాళేశ్వరం అంచనాలు పెంచారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలో రూ. 38 వేల కోట్లు ఎస్టిమేట్ చేసి పనులు మొదలుపెడితే పేరు మార్చి రూ.80 వేల కోట్లకు పెంచి నిర్మాణం చేపట్టారన్నారు. అంచనాలు పెంచినా ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. తుమ్మిడిహెట్టి కంటే మేడిగడ్డ వద్ద ఒక్కచుక్క నీరు కూడా ఎక్కువగా లభ్యం కాదన్నారు. బుధవారం స్థానిక రోడ్లు, భవనాల అతిథిగృహంలో జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే కాంగ్రెస్‌కు పేరొస్తుందనే మేడిగడ్డలో కట్టారని ఆరోపించారు. ఏ ప్రదేశంలో నిర్మిస్తే ప్రాజెక్టు వ్యయం తక్కువవుతుందో తేల్చేందుకు ఇంజినీర్ల అసోసియేషన్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రూ.50 వేల కోట్ల అదనపు భారానికి సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చెక్కువ, ప్రయోజనం తక్కువని చెప్పారు. తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ కడితే 4 వేల కోట్ల నిర్వహణ భారం తప్పేదన్నారు. నిర్వహణ ఖర్చులు పెంచి ప్రజలపై అదనపు భారం మోపారన్నారు. ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

కాళేశ్వరం హోదాకు అడ్డుపడుతున్నదెవరు?

‘కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాకు అడ్డుపడుతున్నది ఎవరు? కేంద్రం సహకరించడం లేదని రాష్ట్రం, రాష్ట్రమే సహకరిస్తలేదని కేంద్రం చెబుతున్నాయి. రెండు ప్రభుత్వాల వైఖరితో రాష్ట్ర ప్రజలపై రూ. 50 వేల కోట్ల భారం పడుతోంది’ అన్నారు. ‘ఎన్డీయేకు మిత్రపక్షంగా ఉన్న టీఆర్ఎస్..  కాళేశ్వరానికి హోదా తీసుకురాలేదా?’ అని ప్రశ్నించారు.