- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
జగిత్యాల, వెలుగు: శాసన సభలో, మండలిలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన జీవన్ రెడ్డి, ఇప్పుడు మద్దతు పలకడం, రేవంత్ రెడ్డిని ఓడగొట్టడమే లక్ష్యమని చెప్పడం బాధాకరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పార్టీ అధ్యక్షుడు నందయ్యతో కలిసి మంత్రి ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసి, ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చిందీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
జీవన్ రెడ్డి గతంలో శాసనసభ, మండలిలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని, కాళేశ్వరంపై అనేక సార్లు ప్రశ్నించారని గుర్తు చేశారు. అలాంటి జీవన్‌రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జీవన్ రెడ్డి ఓడిపోయిన కొద్దిసేపటికే పార్టీ నాయకత్వం ఆయనకు పదవి హామీ ఇచ్చిందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. ఆయన పార్టీ వదిలేయాలని ముందే అనుకోవడంవల్లనే పీసీసీ, మంత్రులు కలిసి మాట్లాడినా స్పందించలేదన్నారు.
