లడఖ్ అనగానే గడ్డకట్టే చలి, ఎత్తైన పర్వత శిఖరాలే గుర్తొస్తాయి. అలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా ప్రకృతి ఎన్నో అద్భుతాలను సృష్టించింది. అందులో ఒకటే సీ బక్‌థార్న్ ఫ్రూట్. అక్కడే పుట్టి పెరిగిన తిన్లెస్ సింఘేకు దాని గురించి ప్రతి విషయమూ తెలుసు. అందుకే ఆ మిరాకిల్ ఫ్రూట్‌ని ఎలాగైనా ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకున్నాడు. ఆ లక్ష్యంతోనే జింపో అనే స్టార్టప్ పెట్టాడు.ఇప్పుడు లక్షల్లో లాభాలను గడిస్తున్నాడు.
తిన్లెస్ సింఘే లడఖ్‌లో పుట్టి, పెరిగాడు. అతను జమ్మూలోని సెంట్రల్ యూనివర్సిటీలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేశాడు. అదేటైంలో ఒకసారి సెలవుల కోసం ఇంటికి వెళ్లాడు. అప్పుడే లడఖ్‌లో టూర్ చేస్తున్న కేరళకు చెందిన ఒక డాక్టర్‌ని కలిశాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా వాళ్ల చర్చ స్థానికంగా ఉండే చెట్ల వైపు మళ్లింది. అక్కడి మూలికలు, వాటి ఉపయోగాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. అప్పుడు ప్రాంతీయంగా దొరికే మూలికల గురించి చెప్పాలనే ఉద్దేశంతో సింఘే సీ బక్‌థార్న్ అనే ఒక బెర్రీ గురించి చెప్పాడు. ఆ రోజు వాళ్లు చాలాసేపు దాని గురించే మాట్లాడుకున్నారు. ఆ సంభాషణ తిన్లెస్ మనసులో ఒక బలమైన ఆలోచనను రేకెత్తించింది. చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరడం కంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న బెర్రీతో జ్యూస్ చేసి మార్కెట్‌లో అమ్మాలి అనుకున్నాడు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘జింపో’ అనే స్టార్టప్.
మ్యాజికల్ ప్లాంట్
ఉత్తర భారతదేశంలో సీ బక్‌థార్న్ మొక్కను మ్యాజికల్ ప్లాంట్ అంటుంటారు. ఇది బెర్రీ ఫ్యామిలీకి చెందినది. మానవ శరీరానికి అవసరమైన ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ యాసిడ్లతో పాటు అత్యంత అరుదుగా లభించే ఒమేగా 7 కూడా ఈ పండ్లలో సమృద్ధిగా దొరుకుతుంది. అన్ని రకాల ఒమేగాలు ఉండే అతి కొద్ది పండ్లలో ఇది ఒకటి. ఇది గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సాయపడుతుంది. సీ బక్‌థార్న్ ఆకులు, వేర్లు, కాండాల్లో మన జీవక్రియను నియంత్రించే అనేక పదార్థాలు ఉంటాయి. అంతేకాదు.. ఇందులో ఉండే పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు ఏ, సీ, ఈ, అధిక స్థాయిలో ఉంటాయి. నారింజ పండుతో పోలిస్తే ఇందులో దాదాపు పన్నెండు రెట్లు ఎక్కువ విటమిన్–సి ఉంటుంది. చలికాలంలో లడఖ్ లాంటి ప్రాంతాల్లో పచ్చని కూరగాయలు దొరకవు. అలాంటప్పుడు ప్రజలకు రోగనిరోధక శక్తిని ఇచ్చే గొప్ప వరం ఈ పండు.
జింపో బ్రాండ్
సీ బక్‌థార్న్‌ను లడఖ్‌తో పాటు, హిమాచల్‌లోని లహౌల్–స్పితి, పీఓకేలోని గిల్గిత్ బల్టిస్తాన్ ప్రాంతాల్లో కూడా పండిస్తున్నారు. దాని విశిష్టతను గుర్తించిన తిన్లెస్ దాన్ని రుచికరంగా మార్చి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. తన ఫ్రెండ్స్ సాయంతో సీ బక్‌థార్న్ గుజ్జుతో జ్యూస్‌లు, స్క్వాష్‌లు, జామ్‌లు తయారుచేశాడు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా పండే ఆప్రికాట్ (ఖుర్బానీ) పండ్లను కూడా సీ బక్‌థార్న్‌తో కలిపి ప్రత్యేకమైన జామ్‌లను రూపొందించాడు. వాటన్నింటినీ ‘జింపో’ అనే పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. లడఖీ భాషలో జింపో అంటే ‘రుచికరమైనది’ అని అర్థం. మొదట్లో స్థానిక యువత సోషల్ మీడియాలో అందించిన సపోర్ట్‌తో ఈ బ్రాండ్ చాలా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో సిటీల్లో సేల్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ ఏటా లక్షల్లో టర్నోవర్ సాధిస్తోంది.
పర్యావరణంపై ప్రేమతో..
తిన్లెస్ వ్యాపారం కేవలం లాభాలకే పరిమితం కాలేదు. అతను పర్యావరణ పరిరక్షణలో కూడా తన వంతు కృషి చేస్తున్నాడు. స్థానిక రెస్టారెంట్లు, దుకాణాల్లో వాడేసిన గాజు సీసాలను కొంటున్నాడు. వాటిని రీసైక్లింగ్ చేసి, తన ప్రొడక్ట్స్ కోసం వాడుతున్నాడు. దీనివల్ల వ్యర్థాలు తగ్గుతున్నాయి. స్థానిక రైతులు గతంలో సీ బక్‌థార్న్‌ను పండించి, సరైన ధర లేక ఇబ్బందిపడేవాళ్లు. పైగా కొండ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక, పంటను సరైన టైంకి మార్కెట్‌కు తరలించలేకపోయేవాళ్లు. దాంతో ఎంతో పంట వృథా అయ్యేది. అయితే.. ఆ వృథాను తగ్గించి, రైతులకు అదనపు ఆదాయం కల్పించడంలో జింపో బ్రాండ్ కీలక పాత్ర పోషిస్తోంది.
సవాళ్లను జయించి..
లడఖ్ లాంటి మారుమూల ప్రాంతాల నుంచి బిజినెస్ ఆపరేట్ చేయడం ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని. సీసాలు, లేబుల్స్, ప్యాకేజింగ్ సామాగ్రి లాంటి వాటి కోసం తరచూ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. చలికాలంలో రోడ్లపై మంచు పేరుకుపోవడం వల్ల సప్లై చైన్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అయినా.. పక్కా ప్రణాళికతో తిన్లెస్ బిజినెస్‌ను నడుపుతున్నాడు. ఇప్పుడు అక్కడి ప్రభుత్వ సాయంతో మరిన్ని వినూత్న ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఒక చిన్న ఆలోచన, పట్టుదల ఉంటే స్థానిక వనరులతోనే అద్భుతాలు సృష్టించవచ్చని నిరుపించాడు తిన్లెస్ సింఘే.
