పెద్దపల్లి, వెలుగు: కాజీపేట–-బల్లార్షా రైల్వే స్టేషన్ల మధ్య పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో రైల్వే బ్రిడ్జిల కోసం ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన కృషి ఫలించింది. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండల కేంద్రం, ఓదెల మండలంలోని పొత్కపల్లి, కొలనూర్, అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామాల వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబి) పనుల కోసం మంగళవారం అధికారులు జాయింట్ సర్వే చేశారు. ఈ తనిఖీలో గ్రామాల సర్పంచులు, ప్రముఖులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సామ్రాట్ రాయ్, భూసేకరణ నిపుణులు పి.దేవరాజ్, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, వివిధ శాఖల చెందిన ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు. కాగా పార్లమెంటు పరిధిలోని లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్‌వోబీలు, అండర్‌పాస్‌ల అవసరాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రెండేళ్లుగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. గతంలో ఎన్నోసార్లు రైల్వే శాఖ మంత్రిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులు, జిల్లా అధికారులతో కలిసి లెవల్ క్రాసింగ్‌ల వద్ద పరిశీలించారు.
