రేపే(మే7) విజయ్ ప్రమాణం స్వీకారం..కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే మద్దతు!

రేపే(మే7) విజయ్ ప్రమాణం స్వీకారం..కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే మద్దతు!

 

  • విజయ్​తో ఫోన్​లో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
  • ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్​ అపాయింట్​మెంట్ ​కోరిన విజయ్‌‌‌‌
  • సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా.. ఓడిన మరుసటి రోజే నియోజకవర్గంలో పర్యటన
  • టీవీకే శాసనసభా పక్ష నేతగా ఎన్నిక

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈ నెల 7న(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ స్టేడియం ఈ చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. సోమవారం వెలువడిన ఫలితాల్లో 234 అసెంబ్లీ స్థానాల్లో 108 చోట్ల విజయం సాధించిన టీవీకే, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మంగళవారం టీవీకే ఎమ్మెల్యేలు సమావేశమై విజయ్​ను తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. 

దీంతో తమిళనాడు సీఎంగా పదవి చేపట్టడానికి విజయ్​కు మార్గం సుగమమైంది. మ్యాజిక్ ఫిగర్​ 118 సీట్ల కోసం కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలతో టీవీకే నేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యే పార్టీలకు నాలుగు నుంచి ఆరు మంత్రి పదవులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు కోరుతూ కాంగ్రెస్ పార్టీని విజయ్ సంప్రదించారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. 

‘‘రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కట్టుబడి ఉండే ఒక లౌకిక ప్రభుత్వం ఏర్పాటు కోసమే తమిళనాడు ప్రజలు తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ భావిస్తున్నది. ఏ రూపంలోనైనా సరే బీజేపీ, దాని అనుబంధ శక్తులు తమిళనాడులో ప్రభుత్వాన్ని నడపకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ దృఢంగా నిర్ణయించుకుంది’’ అని వేణుగోపాల్ తెలిపారు. మరోవైపు లోక్​సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్​కు ఫోన్​ చేసి మాట్లాడడం ప్రాముఖ్యత సంతరించుకుంది. 

ఓటమి పాలైన డీఎంకే అధినేత స్టాలిన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఓడిన మరుసటి రోజే ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు కోసం చర్చించేందుకు తమిళనాడు గవర్నర్ ​రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్​ను విజయ్‌‌‌‌ అపాయింట్​మెంట్​ కోరారు.

ఈ అంశంపై అర్దరాత్రి వరకు చర్చ కొనసాగింది. కానీ, టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కానీ, టీవీకేకు మద్దతు ఇచ్చే దిశగానే కాంగ్రెస్​ నిర్ణయం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో 1967 నుంచి స్వతంత్రంగా అధికారంలో లేదు. టీవీకేతో చేతులు కలపడం వారికి రాజకీయంగా మేలు చేస్తుందని భావిస్తున్నారు. మంత్రివర్గంలో కాంగ్రెస్‌‌కు రెండు పదవులు, ఇతర చిన్న పార్టీలకు ఒక్కో పదవి ఇవ్వాలని చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా మద్దతు ఇచ్చే పార్టీలకు నాలుగు నుంచి ఆరు మంత్రి పదవులు కేటాయించే చాన్స్ ఉంది.

కేబినెట్​లోకి అనుభవం ఉన్న నేతలు

విజయ్ మే7(గురువారం) ప్రమాణ స్వీకారానికి ముందే పలు కీలక పరిణామాలు జరగనున్నాయి. టీవీకే ఎమ్మెల్యేలు తొలుత శాసనసభా పక్ష నేతగా విజయ్‌‌ను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత మెజారిటీ మద్దతు రుజువు చేస్తే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. టీవీకేలో సీనియర్ నేత సెంగొట్టయ్యన్ తప్ప చాలా మంది ఎమ్మెల్యేలు తొలిసారి గెలిచిన వారే. అందువల్ల పరిపాలన అనుభవం ఉన్న నేతలను కేబినెట్‌‌లో చేర్చుకోవడంపై విజయ్ దృష్టి పెట్టారు. 

అవినీతి వ్యతిరేక పోరాటానికి పేరొందిన మాజీ ఐఏఎస్ అధికారి యు.సాగాయంను ఉప ఎన్నికల ద్వారా శాసనసభలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఒకటైన తిరుచి ఈస్ట్ నుంచి అతడిని పోటీకి దింపే అవకాశముంది. ఇక విజయ్ తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయలకు అతీతంగా కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రగతికి పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

మద్దతిచ్చే పార్టీలకు మంత్రి పదవులు!

మ్యాజిక్ ఫిగర్ 118కి విజయ్ పార్టీకి 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ (5 సీట్లు), వీసీకే (2), సీపీఐ (2), సీపీఐ(ఎం) (2) కలిపితే మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు అవుతారు.  ఇది మ్యాజిక్ ఫిగర్ దాటడానికి సరిపోతుంది. టీవీకే ఇప్పటికే కాంగ్రెస్ తమిళనాడు విభాగాన్ని సంప్రదించింది. టీవీకే మద్దతు కోరడంతో రాత్రి 10:30 గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్షం కీలక సమావేశం నిర్వహించింది.