- డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధుల ప్రత్యేక సందర్శన
- ఫోర్త్ సిటీలో ఇండ్ల స్థలాలు ఇస్తామన్న సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వెల్లడి
- సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.. ఆరు నెలల్లో స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) విజ్ఞప్తి చేసింది. ఆదివారం డీజేహెచ్ఎస్ సభ్యులు వందల మంది ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)ని ప్రత్యేకంగా సందర్శించారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తూ డీజేహెచ్ఎస్ సభ్యులు ఆదివారం నెట్ జీరో సిటీ ప్రాంతంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఫోర్త్ సిటీలో ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు చొరవ చూపిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం జరిగిన సభలో డీజేహెచ్ఎస్ ప్రెసిడెంట్ బొల్లోజు రవి, వైస్ ప్రెసిడెంట్ మరిపాల శ్రీనివాస్ మాట్లాడారు. ఆరు నెలల్లోగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్యూచర్ సిటీ హైదరాబాద్‌కు నాలుగో సిటీగా అభివృద్ధి అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అక్కడ అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటైందని, స్కిల్ యూనివర్సిటీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ రాబోతున్నాయని చెప్పారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాలకు ధీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని తెలిపారు. నెట్ జీరో వల్ల కాలుష్య రహిత ప్రాంతంగా ఉంటుందన్నారు. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు మార్గం కూడా రానున్నందున ప్రయోజనం ఉంటుందన్నారు. ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున, దానిని సాధించుకునేందుకు జర్నలిస్టులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
