బాలిక కిడ్నాప్ కేసులో యువకుడు అరెస్ట్.... జులై 8న మలక్పేటలో ఘటన

బాలిక కిడ్నాప్ కేసులో యువకుడు అరెస్ట్.... జులై 8న మలక్పేటలో ఘటన
  • బాలికతో సహా ముంబై, యూపీకి వెళ్లి తిరిగొస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు

అడ్డగూడూరు (యాదాద్రి), వెలుగు : బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో పాటు, కిడ్నాప్ చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ లోని మలక్ పేటకు చెందిన బాలిక ఇటీవల యాదాద్రి జిల్లా అడ్డగూడూరులోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన బాలెంల చైతన్య ప్రేమిస్తున్నానంటూ బాలిక వెంట పడ్డాడు. 

ఈ క్రమంలో ఈ నెల 8న బాలిక ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాలిక అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చైతన్యపై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను మలక్​పేటలోని ఇంటికి పంపించారు. తర్వాత చైతన్య మలక్ పేటకు వెళ్లి బాలికను తన వెంట తీసుకెళ్లాడు. గమనించిన బాలిక పిన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 దీంతో అడ్డగూడూరు, మలక్​పేట పోలీసులు రెండు టీమ్ లుగా ఏర్పడి గాలింపు ప్రారంభించారు. బాలికను చైతన్య ముంబై తీసుకెళ్లాడని తెలియడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్​లోని వారణాసికి వెళ్లినట్టుగా గుర్తించారు. వారణాసి నుంచి బాలికతో సహా తిరిగొస్తున్న చైతన్యను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బాలికలను భువనగిరిలోని సఖి సెంటర్ లో చేర్చారు. చైతన్యను రిమాండ్​కు తరలించినట్టు అడ్డగూడూరు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.